మేడారం మహా జాతరకు వివిధ శాఖల ముమ్మర ఏర్పాట్లు

by Malleboina Mahesh |   (  Updated:2026-01-27 02:25:22  IST  )

ఆసియాలోనే అతిపెద్ద జాతర అయిన మేడారం మహా జాతరకు సర్వం సన్నద్ధం అవుతుంది. సమ్మక్క సారలమ్మ జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకనుగుణంగా నిధులు మంజూరు చేసింది.

మేడారం మహా జాతరకు వివిధ శాఖల ముమ్మర ఏర్పాట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆసియాలోనే అతిపెద్ద జాతర అయిన మేడారం మహా జాతరకు సర్వం సన్నద్ధం అవుతుంది. సమ్మక్క సారలమ్మ జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకనుగుణంగా నిధులు మంజూరు చేసింది. కాగా, ఆయా శాఖల అధికారులు జాతర ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఈ మహా జాతరకు దాదాపు రెండు నుంచి మూడు కోట్ల మంది భక్తుల హాజరయ్యే అవకాశం ఉన్నందున ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లను చేసింది. జాతర రేపటి నుంచి ప్రారంభం కానుండగా ఇక్కడికి వచ్చే భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించేందుకు నీటిపారుదలశాఖ గతం కన్నా అదనపు ఏర్పాట్లను చేసింది. ఇందు కోసం దాదాపు రూ. 50 కోట్ల నిధులతో భక్తులకు ఏర్పాట్లు చేసింది.

ప్రధానంగా రెడ్డిగూడెం నుంచి జంపన్న వాగు మీదుగా చిలకలగుట్ట వరకు నీటి మట్టాన్ని కొనసాగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. జంపన్న వాగులో ఉన్న 29 ఇంఫిలిట్రేషన్ వెల్స్‌ల పూడికను చేపట్టింది. స్నాన ఘట్టాలపై ఉన్న బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్‌లను పునరుద్దరించడంతోపాటు బ్యాటరీ ఆఫ్ ట్యాప్‌లకు నిరంతర నీటిని అందించేందుకు ఇంఫిల్టరేషన్ వెల్స్‌లో సుబ్మెర్సిబుల్ పంపులను ఏరాటు చేసి పైప్ లైన్లను చేపట్టింది. వాగు పొడుగునా 348 బ్యాటరీ ఆఫ్ ట్యాప్‌లను, 119 డ్రస్ చెంగింగ్ రూమ్ లను, జంపన్న వాగులో నీటి మట్టాన్ని ఒకే తీరుగా ఉంచేందుకు 9 క్రాస్ బండ్‌లను నిర్మించారు. నీరు కలుషితం కాకుండా నిరంతరం క్లోరినేషన్ కూడా చేపడుతున్నారు.

నిరంతర విద్యుత్ సరఫరా..

మేడారం జాతరలో 24 గంటలూ విద్యుత్ సరఫరా ఉండేలా విద్యుత్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకుగాను 911 ఎలక్ట్రిక్ స్తంబాలు, 196 ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేసి వీటి నిర్వహణకు 350 అదనపు సిబ్బందిని నియమించింది. వీటితోపాటు, 43 పార్కింగ్ ప్రాంతాల్లో కూడా విద్యుత్ సౌకర్యం కల్పించింది. ఇప్పటికే, జాతర ప్రాంతంలో ఉన్న 11 కేవీ, 33 కేవీ సబ్ స్టేషన్‌లను సిద్ధం చేసింది. భక్తుల రక్షణ చర్యల్లో భాగంగా, 11 కేవీ, 33 కేవీ లైన్లు క్రాస్ అయ్యే జంపన్న వాగు వద్ద ఆరు గస్తీ టవర్లను ఏర్పాటు చేశారు. 50 ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఎమర్జెన్సీ బృందాలను నియమించారు. తాడ్వాయి, పస్రా మార్గంలో పెట్రోలింగ్ టీమ్‌లను కూడా నియమించారు. నాలుగు ట్రాన్స్‌ఫార్మర్లకు ఒక బృందం చొప్పున పర్యవేక్షించనుంది. 33 కేవీ లైన్స్‌ పర్యవేక్షణకు తాడ్వాయి, పస్రా, గోవిందరావుపేట, చెల్పూర్‌, ఏటూరునాగారం, కమలాపూర్‌, ములుగు సబ్‌స్టేషన్‌ల పరిధిలో పెట్రోలింగ్‌, ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్‌ల వద్ద విద్యుత్‌ సరఫరా పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా 20 మంది ఇంజినీర్లు, ఆపరేషన్‌ సిబ్బంది, అత్యవసర పనుల కోసం సామగ్రిని తరలించేందుకు 30 వాహనాలను విద్యుత్ శాఖ ఏర్పాటు చేసింది.

వెటర్నరీ శాఖ ముమ్మర సేవలు..

సమ్మక్క, సారలమ్మ జాతర తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పశువులు అనారోగ్య బారిన పడకుండా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. తాడ్వాయి, పరిసర గ్రామాల్లోని పశువులన్నింటికి వ్యాధి నిరోధక వాక్సిన్‌ను చేశారు. జాతరకు వచ్చే ఎడ్ల బండ్ల ద్వారా వచ్చే ఎడ్లకు కూడా వాక్సినేషన్ ఇచ్చేందుకు ఆరు చెక్‌పోస్ట్‌లు పెట్టారు. పశువులకు గడ్డి, గ్రాసం దొరికే పరిస్థితి ఉండదు, దీనికై మేడారం తో పాటు మరో ఆరు గ్రామాలలో పశువుల గ్రాసం డిపోలను ఏర్పాటు చేశారు. జాతర అనంతరం భక్తులు వదిలిన బెల్లం, ఇతర వ్యర్థాలు తిని పశువులు అనారోగ్యం బారిన పడకుండా ప్రత్యేక పశు వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. పశువులకు ఇంటికి వెళ్లి చికిత్స అందించేందుకు మొబైల్ వెటర్నరీ క్లినిక్‌లను కూడా ఏర్పాటు చేశారు.

పశుశాఖ తరపున ఏడు వెటర్నరీ హెల్త్ క్యాంపులు, రెండు పౌల్ట్రీ చెక్ పోస్ట్‌లు, రెండు విజిలెన్సు బృందాలను ఏర్పాటు చేసి, వీటి నిర్వహణకు 73 మంది అధికారులు, వెటర్నరీ వైద్యులు, సిబ్బందిని నియమించారు. అలాగే రెండు వేల మంది ఆదివాసీ యువత, 200 మంది వలంటీర్లు సేవలందించనున్నారు. అదే విధంగా జాతరలో తప్పిపోయే పిల్లలు, మహిళలు, వృద్ధులను తిరిగి వారి బంధువులకు అందించేందుకు ప్రత్యేకంగా ఆరు మిస్సింగ్ పర్సన్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఈ కాంపులలో తప్పిపోయి వచ్చే వారి సౌకర్యార్థం బాదం మిల్క్, బిస్కెట్ ప్యాకెట్లు, బాలామృతం, ఉడక పెట్టిన గుడ్లు, భోజన సౌకర్యాలను కల్పించారు.

కల్తీ మద్యం నిరోధానికి..

మేడారంలో అక్రమ, కల్తీ మద్యాన్ని నివారించేందుకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. కల్తీ మద్యం, గుడుంబా తయారీని అరికట్టడం, ఆన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను అడ్డుకోవడం, బెల్లం‌ను దుర్వినియోగ పర్చకుండా చూడడంతో పాటు జాతర ప్రాంతంలో స్థానిక గిరిజనులకు లిక్కర్ షాపులు ఏర్పాటు చేసుకునేందుకు ఎక్సయిజ్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. జాతర సందర్బంగా ఏడు రోజుల పాటు 22 పర్మిట్‌లను స్థానిక గిరిజనులకు మంజూరు చేశారు. వీటితోపాటు, ఆరు చెక్ పోస్టులు, 15 మొబైల్ పెట్రోల్ పార్టీలు, ఓ కంట్రోల్ రూమ్, మరో షబ్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి ఎక్సయిజ్ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది.

Next Story