డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్‌గా వైద్య విధాన పరిషత్

by Malleboina Mahesh |

తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ (టీవీ వీపీ)కు కీలక మార్పు దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్‌గా వైద్య విధాన పరిషత్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ (టీవీ వీపీ)కు కీలక మార్పు దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సొసైటీ పరిధిలో ఉన్న టీవీవీపీని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (డీ.ఎస్.హెచ్.ఎస్)గా మార్చే ప్రతిపాదనపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఫైల్‌కు సంతకం చేయడంతో, ఏళ్లుగా వైద్యులు-సిబ్బంది ఎదుర్కొంటున్న వేతనాలు, సేవా ప్రయోజనాల సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభించనుందన్న ఆశలు బలపడుతున్నాయి. డ్రాఫ్ట్, లీగల్ ఒపీనియన్ ప్రక్రియ పూర్తయితే కేబినెట్ ఆమోదమే మిగిలిందని అధికారులు చెబుతున్నారు.

వచ్చే కేబినెట్ లో మార్పు..

తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్(టీవీవీపీ)ని త్వరలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (డి.ఎస్.హెచ్.ఎస్) గా మార్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫైల్ పై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సంతకం చేశారని అధికారులు తెలిపారు. ఆదివారం మేడారంలో జరి గే కేబినెట్ సమావేశంలోనే ఈ ఫైల్ ఓకే అవుతుందని అంచనా వేసినా... డ్రాఫ్ట్ పూర్తి కాకపోవడంతో రాబోయే కేబినెట్ సమావేశం ముందుకు రానుందని తెలుస్తోంది. కాగా... టీవీవీపీని డీ.ఎస్.హెచ్.ఎస్ మార్చేందుకు అవసరమైన విధి విధానాలు ఎలా ఉండాలన్న అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అక్కడి వైద్య విధాన పరిషత్ ను సెకండరీ హెల్త్ కేర్ గా మార్చిన మార్గదర్శకాలను ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. టీవీవీపీ సైతం డీ.ఎస్.హెచ్.ఎస్ గా మార్చాలని ఇక్కడి వైద్యులు, సిబ్బంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు.

అయితే అదిగో ఇదిగో అంటూనే రెండేళ్ల సమయం గడిచిపోయింది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ టీవీవీపీ వైద్యులు, సిబ్బంది చిరకాల వాంఛను నెరవేర్చేందుకు అంగీకరించి సీఎం దృష్టికి తీసుకుపోవడంతో సమస్యకు పరిష్కార మార్గం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 13న ల్యాబ్ టెక్నిషియన్లకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ సైతం టీవీవీపీని డీ.ఎస్.హెచ్.ఎస్ గా మారుస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవడంపై టీజీజీడీఏ రాష్ట్ర అధ్యక్షుడు డా.నరహరి హర్షం వ్యక్తం చేశారు.

సొసైటీ కింద ఉండడం వల్ల..

వైద్య విధాన పరిషత్ సొసైటీ కింద ఉండడం వల్ల ఇందులో పనిచేసే వైద్యులు, నర్సులు, సిబ్బందికి 010 కింద వేతనాలు అందడం లేదు. వీరి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాల్సి వస్తుంది. ప్రతి నెలా చాలా మంది ఉద్యోగులకు జీతాలు బాగా ఆలస్యం అవుతున్నాయి. ఫలితంగా చెల్లించాల్సిన ఈఎంఐలు, ఇతర అవసరాలు తీర్చుకునేందుకు ఇబ్బందులు తప్పడం లేదని వైద్యులు, సిబ్బంది వాపోతున్నారు. జీతాల ఆలస్యంతో సిబిల్ స్కోర్ పోతోందని వాపోతున్నారు. టీవీవీపీ కింద జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు కలిపి 184 వరకు ఉన్నాయి. వీటిల్లో 12,589 మందికి గాను 5వేల ఖాళీలున్నాయి. కాగా ఇందులో పనిచేస్తున్న వారిలో 4300 మంది వైద్యులే ఉన్నారు. టీవీవీపీని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ మారిస్తే ఇందులోని వారికి ఇతర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో సర్వీస్, పదవీ విరమణ ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. అందుకే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి పేరు మార్పు కోసం వైద్యులు, సిబ్బంది ఆరాటపడుతున్నారు.

Next Story