కాలిపోతున్నా.. ఖాళీలను భర్తీ చేయట్లే.. !

by Disha Web Desk |
కాలిపోతున్నా.. ఖాళీలను భర్తీ చేయట్లే.. !
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ అగ్నిమాపక శాఖ ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. అన్ని శాఖల తరహాలోనే ఈ శాఖలోనూ ఖాళీ పోస్టులు వెక్కిరిస్తున్నాయి. మొత్తం 2,258 పోస్టుల్లో ఇప్పటికీ 880 (దాదాపు 39%) భర్తీ కాలేదు. ఇందులో ఎక్కువగా ఫైర్ మెన్, ఆపరేటర్, డ్రైవర్ తదితరాలకు సంబంధించినవే. హైదరాబాద్ విశ్వనగరంగా విస్తరిస్తూ కొత్త కట్టటాలు, అపార్టుమెంట్లు, భవనాలు వెలుస్తున్నా అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ఓసీలు మాత్రం పొందడంలేదు. పట్టించుకోవాల్సిన విజిలెన్స్, జీహెచ్ఎంసీ లాంటి విభాగాలూ నిర్లక్ష్యంగానే ఉన్నాయి. ఎక్కువ ప్రమాదాలు షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరుగుతున్నట్లు ఆ శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి.

ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా భవనాలు పుట్టుకొస్తున్నట్లు అధికారులు ఇటీవల గుర్తించారు. నిబంధనల ఉల్లంఘన నిరంతరం జరుగుతున్నా మొక్కుబడిగా మాత్రమే తనిఖీలు, కూల్చివేతలు చోటుచేసుకుంటున్నాయి. ఇక అగ్నిమాపక శాఖ తరఫున ఎన్ఓసీలు తీసుకోవడం నామమాత్రంగా మారిపోయింది. నివాస ప్రాంతాల్లో పరిశ్రమలు, గోడౌన్లు లాంటివి షరా మామూలు అయిపోయాయి. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు సీరియస్‌గా స్పందించడం, ఆ తర్వాత గాలికొదిలేయడం రొటీన్ అయిపోయింది. ఇప్పుడు సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుని బిహార్‌కు చెందిన కార్మికులు మరణించడంతో హోం మంత్రి హడావిడిగా సమావేశాన్ని ఏర్పాటుచేశారు.

అగ్నిప్రమాదం జరిగినప్పుడు వెంటనే రంగంలోకి దిగే ఫైర్ మాన్, ఆపరేటర్ పోస్టులు ఏళ్ళ తరబడి భర్తీకి నోచుకోవడంలేదు. ఆ శాఖ నివేదిక ప్రకారం గతేడాది ఫిబ్రవరి నాటికే 393 ఆపరేటర్/డ్రైవర్ పోస్టుల్లో కేవలం 177 మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 216 ఖాళీగా ఉన్నట్లు తేలింది. ఫైర్ మాన్ పోస్టుల విషయంలోనూ 1,326 శాంక్షన్డ్ పోస్టులుంటే అందులో 588 ఖాళీగానే ఉన్నాయి. ఇక విభజన చట్టం ప్రకారం తెలంగాణకు మరో 32 పోస్టులు రావాల్సి ఉన్నది. ఇప్పటికీ అది పెండింగ్‌‌లోనే ఉన్నది. రాష్ట్ర జనాభా అవసరాలకు తగినట్లుగా ఫైర్ స్టేషన్లు కూడా లేవు. ప్రతీ మండలానికి ఒకటి ఏర్పాటు చేయనున్నట్లు గతంలో టీఆర్ఎస్ ప్రకటించినా ప్రస్తుతానికి ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మాత్రమే ఉన్నాయి.

నిబంధనల ప్రకారం ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ఉండాలంటూ అగ్నిమాపక శాఖ ఉత్తర్వులు జారీ చేసినా ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా మొక్కుబడిగా చేసిన తనిఖీల్లో 689 చోట్ల ఎన్ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) తీసుకోవాల్సి ఉన్నా పట్టించుకోలేదని ఫైర్ డిపార్టుమెంటు గుర్తించింది. నోటీసులను కూడా జారీ చేసింది. కానీ కేవలం 83 కేసుల్లో మాత్రమే పెనాల్టీ విధించి వివాదాలను ముగించింది. ఇప్పటీ 527 కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఎన్ఓసీ లేకుండా భవనాన్ని నిర్మించుకుండా చూడాల్సిన జీహెచ్ఎంసీ సైతం ప్రేక్షక పాత్రమే పరిమితమైంది. వాణిజ్య సంస్థల్లో, భారీ భవన సముదాయాల్లో పదుల సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తున్నా ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ఉన్నదో లేదో తనిఖీలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.

జరుగుతున్న ప్రమాదాల్లో దాదాపు మూడింట ఒక వంతు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరుగుతున్నట్లు అగ్నిమాపక శాఖ విశ్లేషించింది. నిర్లక్ష్యంగా స్మోకింగ్ చేయడం ప్రధాన కారణమైతే ఆ తర్వాత షార్ట్ సర్క్యూట్‌ ప్రమాదాలే ఎక్కువ. 2020లో రాష్ట్రం మొత్తం మీద 7,899 అగ్ని ప్రమాదాలు జరిగితే అందులో 4,187 స్మోకింగ్ ద్వారా జరిగాయి. మరో 1,992 విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌ల ద్వారా జరిగాయి. ఎక్కువగా దుకాణాలు, ఆఫీసుల్లోనే జరుగుతున్నట్లు తేలింది. ఆ తర్వాతి స్థానం ఫ్యాక్టరీలు, పరిశ్రమలే. ఇక ఇళ్ళు, రోడ్ల మీద వాహనాలు కాలిపోవడం లాంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి.


Next Story

Most Viewed