- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికా అడుగుపెట్టేది ఇక్కడే!
ఇరాన్ గడ్డపై అమెరికా సైనికులు అడుగుపెట్టడం దాదాపుగా ఖరారైంది.

ఇరాన్ గడ్డపై అమెరికా సైనికులు అడుగుపెట్టడం దాదాపుగా ఖరారైంది. ఈ నెల 6వ తేదీతో ముగిసే యుద్ధ విరామం గడువు పొడగింపు అవుతుందా లేదా అన్నది అమెరికా సైనికుల మోహరింపుపై ఆధారపడి ఉన్నది. మోహరింపు పూర్తయి.. యుద్ధానికి పూర్తిగా సన్నద్దం అయితే విరామం గడువు పొడగింపు ఉండదు. మిత్రదేశాలు లేదా ఇతర ఏర్పాట్లకు సమయం అవసరమైతేనే పొడగింపు ఉండనున్నది. అందుకే ఇరాన్ కూడా చర్చలు జరగడం లేదు.. కేవలం సందేశాలను మాత్రమే వింటున్నామని ప్రకటించింది.
అదేసమయంలో ఇరాన్ కూడా ప్రపంచంపై ఒత్తిడి పెంచేందుకు సాధ్యమైనంత వరకు అమెరికా దళాలు ఇరాన్ లోకి అడుగుపెట్టకుండా చూసుకోవడంతోపాటు హార్ముజ్‌పై పట్టు కొనసాగించి యుద్ధాన్ని మరింత కాలం పొడిగించడమే టార్గెట్‌గా పెట్టుకున్నది. చమురు అందకపోతే చాలా దేశాలకు ముఖ్యంగా భారత్, చైనా, యూరప్ దేశాలకు ఊపిరి ఆగిపోయినట్టే అవుతుంది. అందుకే ప్రపంచం ఒత్తిడి పెంచితే అది అమెరికాపై ప్రభావం చూపుతుందని ఇరాన్ ప్లాన్. అప్పుడు ఇరాన్ పెట్టే షరతులకు అమెరికా అంగీకరించాల్సి వస్తుంది. ఆ టైమ్ వరకు యుద్ధాన్ని పొడగించాలని ఇరాన్ అనుకుంటున్నది. అయితే, అమెరికా దళాలు భూతల దాడులకు (గ్రౌండ్ ఇన్వేషన్)కి దాదాపు సిద్ధమైనట్టు తెలుస్తున్నందున వారు ఎక్కడనుంచి ఇరాన్ లోకి అడుగుపెడతారన్నది ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న సందేహం..
మూడు వైపుల నుంచి అవకాశం.. కానీ,
అమెరికా ఇరాన్‌పై గ్రౌండ్ ఇన్వేషన్ ప్రారంభించాలనుకుంటే, ప్రధానంగా మూడు వైపుల నుండి జరిగే అవకాశం ఉంది. దక్షిణాన పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ తీర ప్రాంతాల నుండి ఉభయచర దాడుల ద్వారా బందర్ అబ్బాస్, చాబహార్ వంటి కీలక ఓడరేవులను లక్ష్యం చేసుకోవచ్చు. పశ్చిమాన ఇరాక్ సరిహద్దుల నుండి, తూర్పున ఆఫ్ఘనిస్తాన్ లేదా పాకిస్తాన్ సరిహద్దుల వద్ద ఉన్న అమెరికా అనుకూల స్థావరాల నుండి కూడా చొచ్చుకు రావొచ్చు. అయితే, ఇరాన్ భౌగోళికం చాలా క్లిష్టమైనది. జగ్రోస్ పర్వత శ్రేణులు సహజ రక్షణ కవచంలా పనిచేస్తాయి. కాబట్టి అమెరికా తన దాడులను టెహ్రాన్ వరకు తీసుకెళ్లకుండా, కేవలం చమురు నిల్వలున్న ఖర్గ్ ఐలాండ్, బుషెహర్ అణు ప్లాంట్‌తోపాటు దక్షిణ తీర ప్రాంతాల నియంత్రణకే పరిమితం చేసే అవకాశం ఉంది. పూర్తిస్థాయి ఆక్రమణ కంటే ఇరాన్ ఆర్థిక, సైనిక వెన్నెముకను విరిచేలా ఈ ‘లిమిటెడ్ గ్రౌండ్ ఆపరేషన్’ సాగవచ్చు.
ఒక్కో సైనికుడికి మిలియన్ డాలర్లు
ఈ స్థాయి యుద్ధానికి అమెరికాకు అయ్యే ఖర్చు ఊహాతీతం. ఇరాక్, అఫ్గానిస్తాన్ యుద్ధాల అనుభవాలను బట్టి చూస్తే, ఇరాన్ వంటి పటిష్టమైన సైన్యం ఉన్న దేశంతో యుద్ధానికి ప్రాథమికంగానే 2 నుండి 3 ట్రిలియన్ డాలర్ల ఖర్చు అవుతుందని ఆర్థిక నిపుణుల అంచనా. అమెరికా ఇందులో ఎం1 అబ్రమ్స్ ట్యాంకులు, బ్రాడ్లీ ఫైటింగ్ వెహికల్స్, స్ట్రైకర్ ఆర్మ్డ్ వెహికల్స్ మరియు వేల సంఖ్యలో హమ్వీలను వినియోగిస్తుంది. వీటికి అదనంగా గాలిలో ఆధిపత్యం కోసం ఎఫ్-35, ఎఫ్-22 స్టెల్త్ విమానాలతోపాటు భూగర్భ బంకర్లను ఛేదించే ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ (MOAB) వంటి శక్తివంతమైన ఆయుధాలను వాడుతున్నది. కేవలం ఆయుధాలకే కాకుండా, లక్షలాది మంది సైనికులకు అవసరమైన లాజిస్టిక్స్, ఇంధనం మరియు వైద్య సహాయం కోసం రోజుకు వందల కోట్ల రూపాయల వ్యయం చేయాల్సి ఉంటుంది. నిజానికి యుద్ధ సమయాల్లో ఒక్కో సైనికుడికి జీతాలతోపాటు అతడికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ఏడాదికి దాదాపు ఒక మిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇప్పటికే 3ట్రిలియన్ల అప్పుల్లో ఉన్న అమెరికాకు ఇది ఊహించని షాక్ లాంటిది. యుద్ధం పొడగిస్తే మాత్రం అమెరికా మరో ఐదేళ్లపాటు ద్రవ్యోల్బణంలో మునిగిపోతుంది.
కాంగ్రెస్ ఆమోదం లేకున్నా..
రాజ్యాంగపరంగా చూస్తే అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) ఆమోదం లేకుండా అధ్యక్షుడు పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రకటించలేరు. అయితే, ‘వార్ పవర్స్ యాక్ట్ (1973)’ ప్రకారం, అమెరికా భద్రతకు ముప్పు ఉందనే నెపంతో అధ్యక్షుడు కాంగ్రెస్ అనుమతి లేకుండానే 60 నుంచి గరిష్ఠంగా 90 రోజుల పాటు సైనిక చర్యకు ఆదేశించవచ్చు. ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్‌లో ఇరాన్‌పై కఠిన చర్యలకు మొగ్గు ఉన్నప్పటికీ, గ్రౌండ్ ఇన్వేషన్‌కు పూర్తి స్థాయిలో ఆమోదం లభించడం కష్టం. అధ్యక్షుడు తనకున్న ‘ఆర్టికల్ 2’ అధికారాలను ఉపయోగించి ‘పరిమిత దాడులు’ లేదా ‘డిఫెన్సివ్ యాక్షన్’ పేరుతో సైన్యాన్ని పంపవచ్చు. సాధారణంగా ఇలాంటి కీలక దాడులకు ముందు కాంగ్రెస్ ఆథరైజేషన్ ఆఫ్ యూజ్ ఆఫ్ మిలిటరీ ఫోర్స్ (ఏయూఎంఎఫ్) అనే తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది, దీనికి సంబంధించి చర్చలు ప్రస్తుతం వాషింగ్టన్‌లో అంతర్గతంగా జరుగుతున్నాయి, కానీ అధికారిక ఆమోదం రావడానికి మరికొన్ని వారాలు పట్టవచ్చు.
కీలకంగా బాబ్ ఎల్-మండేబ్
హౌతీలు బాబ్ ఎల్-మండేబ్‌ను బ్లాక్ చేస్తే ప్రపంచ వాణిజ్యం స్తంభిస్తుంది. ఎర్ర సముద్రం ద్వారా యూరప్, ఆసియా మధ్య జరిగే 12% వాణిజ్యం ఆగిపోతుంది. దీనివల్ల వస్తువుల ధరలు, ముఖ్యంగా ఆహారంతోపాటు ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతాయి. అన్నిటికంటే ప్రమాదకరమైనది ఏమిటంటే, ఆ సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్. ఒకవేళ హౌతీలు వీటిని ధ్వంసం చేస్తే, ఆసియా- యూరప్ మధ్య డిజిటల్ కనెక్షన్ కట్ అయ్యి బ్యాంకింగ్, కమ్యూనికేషన్ వ్యవస్థలు అస్తవ్యస్తమవుతాయి. ఇది కేవలం ఒక యుద్ధం కాదు, గ్లోబల్ ఎకానమీకి ఒక ‘బ్లాక్ హోల్’లా మారుతుంది. ఒకవేళ మండేబ్ పూర్తిగా బ్లాక్ అయితే, అమెరికా తన మిత్రదేశాలతో కలిసి యెమెన్‌పై కూడా పరిమిత భూతల దాడికి దిగే ప్రమాదం ఉంది. ఇది యుద్ధాన్ని మరింత సంక్లిష్టంగా మార్చి, మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు కూడా లేకపోలేదు. అంతిమంగా యుద్ధం చర్చలతోనే ముగిసిపోతే ఆర్థికవ్యవస్థలు చావు అంచుకువెళ్లి వచ్చినంత ఊరటనిస్తుంది.. పొరపాటు నిర్ణయాలు తీసుకుంటే చరిత్ర వారిని దోషులుగా నిలబెడుతుందన్నది వాస్తవం.
హరీశ్ ఎస్పీ
(గ్లోబల్ వాచ్)






