అమెరికా-ఇరాన్ మధ్య చర్చలకు ముహూర్తం ఫిక్స్!

by Muthe.Rajitha |   (  Updated:2026-04-09 06:36:44  IST  )

అమెరికా-ఇరాన్ మధ్య ఈ వారాంతంలో ఇస్లామాబాద్ లో చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టు వైట్ హౌస్ వర్గాలు పేర్కొన్నాయి.

అమెరికా-ఇరాన్ మధ్య చర్చలకు ముహూర్తం ఫిక్స్!
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా - ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు కీలకమైన ఘట్టానికి చేరుకున్నాయి. గత కొన్ని రోజులుగా సాగుతున్నయుద్ధం నేపథ్యంలో ఇరువైపులా 14 రోజుల కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఇరాన్ ప్రతిపాదించిన 11 ప్రధాన షరతులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. కాగా

ఈ వారాంతంలో ఇస్లామాబాద్ వేదికగా ఇరు దేశాల ప్రతినిధుల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగే అవకాశం ఉంది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వం వహిస్తున్న ఈ చర్చల్లో, ఇరాన్ పెట్టిన షరతుల అమలుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై $2 మిలియన్ల రుసుము, యురేనియం ఎన్రిచ్మెంట్ పై అమెరికా తన అభ్యంతరాలను, ప్రతిపాదనలను చర్చించనుంది. ఈ చర్చలు విజయవంతమైతే, పశ్చిమాసియాలో శాశ్వత శాంతి నెలకొనే అవకాశం ఉంది.

ఇజ్రాయెల్ దాడులు - చర్చలపై నీలినీడలు

అయితే ఈ కీలక చర్చలకు ముందు ఇజ్రాయెల్ వ్యవహరిస్తున్న తీరు ఇరాన్‌ను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ, లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు నిర్వహించడం వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. "లెబనాన్‌పై దాడులు ఆపాలి" అనే షరతును అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్ ఉల్లంఘించడంతో, ఇరాన్ ఇప్పుడు చర్చలకు వస్తుందా లేదా అన్నది అనుమానంగా మారింది. "ఒప్పందాన్ని గౌరవించని వారితో చర్చలు జరపడం వృధా" అని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) భావిస్తోంది. ఒకవేళ ఇరాన్ ఈ చర్చల నుండి వెనక్కి తగ్గితే, 14 రోజుల కాల్పుల విరమణ గడువు ముగిసిన వెంటనే పరిస్థితి మళ్లీ మొదటికి రానుంది. అప్పుడు ట్రంప్ హెచ్చరించినట్లుగా ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు జరగడమో లేదా ఇరాన్ ప్రతిదాడికి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.

రిపోర్టులు తారుమారు.. పాక్‍కు పెత్తనమిస్తే నిండా ముంచేసిందా?

ఒక్క తప్పు చేసినా యుద్ధం మొదలే: ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్

Next Story