రిపోర్టులు తారుమారు.. పాక్‍కు పెత్తనమిస్తే నిండా ముంచేసిందా?

by Prasad Jukanti |   (  Updated:2026-04-09 06:35:24  IST  )

అమెరికా-ఇరాన్ యుద్ధ విరమణ ఒప్పందంలో పాకిస్థాన్ రిపోర్టులు మార్చేసి ఇరుపక్షాలను మోసం చేసినట్లు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

రిపోర్టులు తారుమారు..  పాక్‍కు పెత్తనమిస్తే నిండా ముంచేసిందా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: దాయాది దేశం పాకిస్తాన్ (Pakistan) మరోసారి అంతర్జాతీయ సమాజం ముందు జోకర్‍గా నిలిచిందా? ఇజ్రాయెల్, అమెరికా(USA) -ఇరాన్ (Iran) మధ్య కాల్పుల విరమణకు (Ceasefire Deal)మధ్యవర్తిత్వం పేరుతో ఇరుపక్షాలను మభ్యపెట్టిందా? యుద్ధాన్ని ఆపే విషయంలో బ్రోకరిజం చేయబోయి చివరకు జోకర్‍గా మిగిలిందా అంటే అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం అవుననే సమాధానమే వస్తోంది. తనను తాను శాంతిదూతగా చూపించుకోవడానికి తమను మధ్యవర్తిత్వం వహించేలా పంపించాలంటూ అమెరికాను ప్రాధేయపడిన పాకిస్తాన్ ఆ అవకాశం ఇచ్చిన ట్రంప్‍తో పాటు ఇరాన్‍ను సైతం మోసగించినట్లు తాజాగా కథనాలు వెలువడుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడులకు దిగడం వెనుక పాకిస్తాన్ ఆడిన తొండాటనే కారణం అనే టాక్ వినిపిస్తోంది. దీంతో పాకిస్తాన్ చేసిన పనికి అమెరికా సీరియస్ అయినట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

రిపోర్టులు మార్చేసిన పాక్:

యుద్ధ విరమణ విషయంలో అమెరికా కొన్ని షరతులు విధిస్తే ఇరాన్ కూడా మరికొన్ని షరతులను విధించింది. ఈ డిమాండ్లపై ఆయా దేశాలతో చర్చించి డీల్ సెట్ చేస్తామంటూ ముందుకు వచ్చిన పాకిస్తాన్ మరోసారి తన కపట బుద్ధిని ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఇరాన్ ఇచ్చిన అసలు డిమాండ్లను మార్చి వేసి అమెరికాకు, అమెరికా ప్రతిపాదించిన డిమాండ్లలోని అసలు విషయాలను మరుగున పెట్టి ఇరాన్‍కు ఇచ్చి ఇద్దరిని మభ్యపెట్టి యుద్ధ విరమణపై తీవ్ర గందరగోళం సృష్టించింది. పాకిస్తాన్ చర్యతో యూఎస్ వైస్ ప్రెసిడెంట్ నుంచి వైట్ హౌస్ వరకు అందరూ గందరగోళానికి గురైంది. దీంతో పాక్ తీరుపై అమెరికా, ఇరాన్ అసహనం వ్యక్తం చేస్తోంది. ఇరాన్ పది డిమాండ్లను ఒప్పుకునేది లేదని అమెరికా మరోసారి స్పష్టం చేస్తే లెబనాన్ పై దాడులు ఆపాల్సిందేనంటూ ఇరాన్ పట్టుబడుతోంది. అసలు ఈ ఒప్పందంలో లెబనాన్ అంశమే లేదని యూఎస్ అంటుంటే అదంతా నౌ చల్తా ఒప్పందంలో లెబనాన్ కూడా ఉందని ఇరాన్ చెబుతోంది. దీంతో ఈ గందరగోళానికి దారి అవకాశం ఇచ్చిన పాకిస్తాన్ తీరుపై మరోసారి సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

పొరబడ్డారు:

తాజా పరిస్థితిపై అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ మాట్లాడుతూ.. ఇరాన్ ప్రతినిధులు లెబనాన్ కూడా ఇందులో ఉందని పొరబడ్డారని, తాము అలాంటి హామీ ఏదీ ఇవ్వలేదని పేర్కొన్నారు.ఇరాన్‌కు ఒక రకమైన ఒప్పంద పత్రాన్ని, అమెరికాకు మరో రకమైన పత్రాన్ని పాక్ సమర్పించి ఉండవచ్చని 'ది మిడిల్ ఈస్ట్' నివేదించింది. మధ్యవర్తిత్వం పేరుతో పెద్దరికం చేయడానికి ముందుకు వచ్చిన పాకిస్తాన్ తీరుపై మొదటి నుంచి విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఈ ఒప్పందంపై ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పెట్టిన పోస్ట్‌లో 'Draft - Pakistan’s PM Message' అనే పదాన్ని తొలగించడం మర్చిపోవడం నిన్నటి నుంచి విమర్శలు వస్తూనే ఉండగా ఇప్పుడు ఏకంగా ఇరు పక్షాల డిమాండ్లను మార్చివేసి మభ్యపెట్టారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

ఒక్క తప్పు చేసినా యుద్ధం మొదలే: ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్

Next Story