- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్యూ లైన్‌లో ఉండగానే మాయమైన యూరియా బ్యాగులు.. సొసైటీల్లో రైతుల కొత్త కష్టాలు!
రెక్కలు ముక్కలు చేసుకుని ఆకాశం వైపు చూస్తూ సాగుకు సిద్ధమవుతున్న రైతన్నకు సొసైటీల్లో కొత్త కష్టాలు మొదలయ్యాయి.

దిశ,తాడ్వాయి: రెక్కలు ముక్కలు చేసుకుని ఆకాశం వైపు చూస్తూ సాగుకు సిద్ధమవుతున్న రైతన్నకు సొసైటీల్లో కొత్త కష్టాలు మొదలయ్యాయి. తాడ్వాయి మండలం దేమి కలాన్ సొసైటీ పరిధిలోని కనకల్ గ్రామంలో యూరియా పంపిణీలో జరిగిన ఓ విచిత్రమైన మోసం ఇప్పుడు రైతాంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అక్షరజ్ఞానం లేని అమాయక మహిళా రైతులే లక్ష్యంగా చేసుకుని సొసైటీ కేంద్రాల్లో సరికొత్త డిజిటల్ దొంగతనం సాగుతోందా? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. తాడ్వాయి గ్రామానికి చెందిన ఓ మహిళా రైతు ఉదయం తన పొలానికి కావాల్సిన యూరియా కోసం ఆన్‌లైన్ ద్వారా నాలుగు బ్యాగులను (1) KT196685667, (2)KT 276682999 గల బుక్ చేసుకుంది. ఫోన్ ఆపరేటింగ్ రాకపోవడంతో ఆ బుకింగ్ నంబర్లను ఒక కాగితం ముక్క పై కుమారుడితో రాయించుకుని దేమికలాన్ సొసైటీ పరిధిలోని కన్కల్ గ్రామంలోని రైతు వేదిక యూరియా పంపిణీ కేంద్రానికి పరుగెత్తింది.
ఎండను సైతం లెక్కచేయకుండా గంటల తరబడి క్యూ లైన్‌లో నిల్చొని, తీరా కౌంటర్ దగ్గరికి వెళ్లేసరికి సొసైటీ సిబ్బంది ఆమెకు గట్టి షాక్ ఇచ్చారు. ఈ బుకింగ్ నంబర్‌పై ఉన్న నాలుగు బ్యాగుల్లో రెండు ఆల్రెడీ ఎవరో తీసుకెళ్లినట్లు ఆన్లైన్ చూపెడుతుంది. ఇంకో రెండు మాత్రమే ఉన్నాయి తీసుకో అని తేల్చి చెప్పారు. అయితే బుకింగ్ నంబర్ తన చేతిలోనే ఉంది. ఫోన్ తన దగ్గరే ఉంది.. తానేమో క్యూ లైన్ లోనే నిల్చుంది. మరి తన యూరియాను ఎవరో ఎలా తీసుకెళ్తారని ఆ మహిళా రైతు నెత్తీనోరు బాదుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఆన్‌లైన్ రికార్డుల్లో డెలివరీ అని చూపిస్తోంది.. మేమేం చేయలేం అంటూ సిబ్బంది చేతులేత్తేయ్యడంతో, ఆ పేద రైతు కన్నీళ్లతో ఉన్న ఆ రెండు బ్యాగులనే సర్దుకుని దిక్కుతోచని స్థితిలో ఇంటిబాట పట్టింది.
రైతు లోకం ప్రశ్న.. అధికారుల సమాధానమేది..?
మార్కెట్‌లో ఉన్న యూరియా కొరతను ఆసరాగా చేసుకొని, చదువురాని మహిళలను టార్గెట్ చేస్తూ సాగుతున్న ఈ దగా పై రైతులు మండిపడుతున్నారు. అసలు రైతుకు తెలియకుండా ఆన్‌లైన్ రికార్డుల్లో డెలివరీ అని ఎలా పడుతుంది? క్యూ లైన్ లో అసలు యజమాని ఉండగానే.. లోపల లూటీ చేసిన ఆ అదృశ్య ఘనాపాటి ఎవరు? ఇది కేవలం ఒక మహిళకు జరిగిన అన్యాయం మాత్రమే కాదని, పలు సొసైటీలో జరుగుతున్న పెద్ద లోపానికి నిదర్శనమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఈ కన్కల్ గ్రామంలో జరిగిన యూరియా వ్యవహారంపై విచారణ జరిపి, సంబంధిత రైతుకు న్యాయం చేయాలని తాడ్వాయి మండల రైతాంగం డిమాండ్ చేస్తోంది.






