- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాధి హామీ పనిలో విషాదం.. గుండెపోటుతో మహిళా కూలీ మృతి
కోదాడ మండలంలోని నల్లబండగూడెం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం(ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్) పనులు జరుగుతున్న ప్రదేశంలో విషాద ఘటన చోటుచేసుకుంది.

దిశ, కోదాడ: కోదాడ మండలంలోని నల్లబండగూడెం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం(ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్) పనులు జరుగుతున్న ప్రదేశంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పని చేస్తుండగానే గుండెపోటుకు గురైన మహిళా కూలీ అక్కడికక్కడే మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన వేముల పుల్లమ్మ(56) శుక్రవారం ఉదయం ఇతర కూలీలతో కలిసి ఉపాధి హామీ పనులకు హాజరయ్యారు. ఎప్పటిలాగే ఉత్సాహంగా పనులు చేస్తున్న ఆమెకు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థత కలిగి కుప్పకూలిపోయారు.
ఇది గమనించిన తోటి కూలీలు వెంటనే ఆమెను అప్రమత్తం చేయడానికి ప్రయత్నించగా స్పందించలేదు. స్థానికులు, తోటి కార్మికులు కలిసి ప్రాథమిక సహాయం అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. గుండెపోటుతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో పని ప్రదేశంలో ఒక్కసారిగా విషాద వాతావరణం నెలకొంది. కొద్దిసేపటి క్రితం వరకు తమతో కలిసి పనిచేసిన పుల్లమ్మ ఒక్కసారిగా మృతి చెందడాన్ని జీర్ణించుకోలేక తోటి కూలీలు కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబ సభ్యులు ఘటనాస్థలానికి చేరుకుని బోరున విలపించడంతో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి.
సమాచారం అందుకున్న కోదాడ ఎంపీడీవో ఇసాక్ హుస్సేన్ ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పుల్లమ్మ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన ఆయన, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తరఫున అందే సహాయం పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.పేద కుటుంబానికి చెందిన పుల్లమ్మ ఉపాధి హామీ పనుల ద్వారానే జీవనోపాధి పొందుతున్నారని గ్రామస్తులు తెలిపారు. కుటుంబానికి ఆమెనే ప్రధాన ఆధారంగా ఉండటంతో ఇప్పుడు వారి పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం, ప్రత్యేక పరిహారం అందించాలని గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.






