నాకు తప్పకుండా న్యాయం జరుగుతుంది.. మీనాక్షి నటరాజన్ హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |

నాపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని, అన్యాయంగా రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించా మీనాక్షి నటరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నాకు తప్పకుండా న్యాయం జరుగుతుంది.. మీనాక్షి నటరాజన్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) నామినేషన్ దాఖలు చేయగా.. కోర్టు కేసులు అఫిడవిట్‌లో వెల్లడించలేదని రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్‌ను తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనిపై ఆలిండియా కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా స్పందించింది. రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేయగా.. ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలోనే మొత్తం వ్యవహారంపై మీనాక్షి నటరాజన్ రియాక్ట్ అయ్యారు. ఇవాళ ఆమె హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభ ఎన్నికల అఫిడవిట్‌లో సమాచారం మొత్తం ఇచ్చానని తెలిపారు. తాను ఏ సమాచారమూ దాచలేదని స్పష్టం చేశారు. తనపై ఎలాంటి క్రిమినల్‌ కేసు లేదని, నేరపూరిత చర్యలకు పాల్పడలేదని అన్నారు. అడిగిన సమాచారాన్ని అఫిడవిట్‌లో ఇచ్చినా తన నామినేషన్‌‌ను అన్యాయంగా తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని తాను భావిస్తున్నానని తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ అన్నారు.

నాంపల్లి కోర్టుకు మీనాక్షి నటరాజన్ లాయర్లు..

మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ తిరస్కరణకు కారణమైన కాంగ్రెస్ నేత కుంభం శివకుమార్ రెడ్డి (Kumbham Shivakumar Reddy) లైంగిక వేధింపుల ప్రైవేటు పిటిషన్ కేసు ఇవాళ నాంపల్లి కోర్టు (Nampally Court)లో విచారణకు వచ్చింది. 4వ అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసుపై వాదనలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు కోర్టులో కౌంటర్ దాఖలు చేసి మీనాక్షి నటరాజన్ తరఫు ఆమె లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

నాకు ప్రాణభయం ఉంది.. పిటిషనర్ బండారు శ్రీలత

మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్‌గా ఉన్న బండారు శ్రీలత (Bandaru Srilatha) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసు వివరాలు ఎలా లీక్ అయ్యాయో తనకు తెలియదని, అనుకోకుండానే కొన్ని వివరాలు బయటకు వచ్చాయని ఆమె స్పష్టం చేశారు. ఈ కేసు కారణంగా తనకు కొంతమంది నుండి ప్రాణభయం ఉందని, తనను కోర్టుకు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తాను ప్రయాణిస్తున్న ఆటోను కొందరు వ్యక్తులు వెంబడించారని శ్రీలత ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తనకు న్యాయం జరిగే వరకు న్యాయపోరాటం కొనసాగిస్తానని ఆమె తేల్చి చెప్పారు. ఇదే సమయంలో తన రాజకీయ ప్రస్థానంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, తాను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నానని ఆమె స్పష్టం చేశారు.

Next Story