తుంగతుర్తిలో రాజకీయ ఉద్రిక్తత.. కాంగ్రెస్ నాయకులపై దాడి

by Kodari Anjali |

తుంగతుర్తి నియోజకవర్గంలో రాజకీయ వర్గాల మధ్య విభేదాలు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి.

తుంగతుర్తిలో రాజకీయ ఉద్రిక్తత.. కాంగ్రెస్ నాయకులపై దాడి
X

దిశ, తిరుమలగిరి: తుంగతుర్తి నియోజకవర్గంలో రాజకీయ వర్గాల మధ్య విభేదాలు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. మాటల యుద్ధంగా ప్రారంభమైన విభేదాలు తాజాగా దాడుల వరకు వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ కోమటిరెడ్డి సోదరులపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం తిరుమలగిరిలోని వంగపల్లి నరసయ్య ఫంక్షన్ హాల్‌లో యువజన కాంగ్రెస్ నాయకుడు కందుకూరి అంబేద్కర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాట్లాడిన నాయకులు, మాదిగ జాతికి అన్యాయం జరిగితే సహించబోమని, ప్రోటోకాల్‌తో పాటు ఇతర పార్టీల అంతర్గత వ్యవహారాలపై ఎమ్మెల్యే ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని, అలాంటి అంశాలను పార్టీ పెద్దలతో చర్చించాలన్నారు. విలేకరుల సమావేశం ముగిసిన అనంతరం ఫంక్షన్ హాల్ బయటకు వచ్చిన కందుకూరి అంబేద్కర్‌పై కొందరు వ్యక్తులు అకస్మాత్తుగా దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.

రాజకీయంగా ఎదుర్కొలేక..

ఈ ఘటనను అడ్డుకునేందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకుడు పర్రెపాటి యుగంధర్‌ను కూడా కారులో నుంచి బయటకు లాగి పిడిగుద్దులతో దాడి చేసినట్లు బాధితులు ఆరోపించారు. ఈ దాడి ఎమ్మెల్యే సామేల్ వర్గానికి చెందిన వ్యక్తులే రాజకీయ కక్షతో జరిపినట్లు యుగంధర్ మీడియాకు తెలిపారు. అయితే ఈ ఘటనపై పోలీసులు భిన్నమైన వివరణ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ సమీపంలోని ఫంక్షన్ హాల్ వద్ద జరిగిన ఈ గొడవకు రాజకీయ సంబంధం లేదని, కందుకూరి అంబేద్కర్‌కు వారి కులానికి చెందిన వ్యక్తులతో ఉన్న వ్యక్తిగత, కుటుంబ విభేదాల నేపథ్యంలో పరస్పర ఘర్షణ చోటుచేసుకుందని ఎస్సై వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ ఘటనకు ఏ రాజకీయ పార్టీ లేదా నాయకుడితో సంబంధం లేదని, అనవసరంగా రాజకీయ రంగు పులమవద్దని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై కందుకూరి అంబేద్కర్, పర్రెపాటి యుగంధర్ సూర్యాపేట జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దాడిలో ఇరువురికి స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. వ్యక్తిగత గొడవలు ఉంటే అంబేద్కర్ ఒక్కడిపైనే దాడి చేయాలి కానీ నాపై ఎందుకు దాడి చేశారని యుగంధర్ ప్రశ్నించారు. ఇది పథకం ప్రకారమే రాజకీయంగా ఎదుర్కొలేక ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Next Story