తెలంగాణలో ఎస్ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండాలి.. చిన్న నిర్లక్ష్యానికి తావులేదు: కేసీ వేణుగోపాల్

by Ramesh Naini |

తెలంగాణలో ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియకు సంబంధించిన పార్టీ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ విషయంలో చిన్నపాటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పార్టీ నాయకత్వానికి సూచించారు.

తెలంగాణలో ఎస్ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండాలి.. చిన్న నిర్లక్ష్యానికి తావులేదు: కేసీ వేణుగోపాల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియకు సంబంధించిన పార్టీ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ విషయంలో చిన్నపాటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పార్టీ నాయకత్వానికి సూచించారు. సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో తెలంగాణ సంస్థాగత వ్యవహారాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు రెండు గంటలపాటు కొనసాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పార్టీ సంస్థాగత కార్యక్రమాల పురోగతి, ఎస్ఐఆర్ ప్రక్రియలో పార్టీ పనితీరు, క్షేత్రస్థాయిలో చేపట్టిన చర్యలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.

సమావేశంలో బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చేపట్టిన సంస్థాగత కార్యక్రమాలపై కేసీ వేణుగోపాల్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమం అమలు తీరు ప్రశంసనీయంగా ఉందని ఆయన అభినందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, బుధవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన టీపీసీసీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత కార్యక్రమాల పురోగతితో పాటు ఎస్ఐఆర్ ప్రక్రియపై సమగ్రంగా చర్చించి, భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Next Story