- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీరాలం చెరువులో ఐకానిక్ వంతెనతోపాటే దీవుల అభివృద్ధి.. పనులపై మూసీ ఎండీ సమీక్ష
మీర్-ఆలం చెరువుపై నిర్మిస్తున్న ఐకానిక్ వంతెన పనులతోపాటు చెరువులోని రెండు దీవుల అభివృద్ధిని కూడా సమాంతరంగా చేపట్టి పూర్తి చేయాలని మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇ.వి. నరసింహా రెడ్డి అధికారులను ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మీర్-ఆలం (మీరాలం) చెరువుపై నిర్మిస్తున్న ఐకానిక్ వంతెన పనులతోపాటు చెరువులోని రెండు దీవుల అభివృద్ధిని కూడా సమాంతరంగా చేపట్టి పూర్తి చేయాలని మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ ఇ.వి. నరసింహా రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం మీర్ ఆలం చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆయన సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్ష సందర్భంగా ఐకానిక్ వంతెన నిర్మాణ పురోగతి, చెరువు ప్రక్షాళన, మురుగు నీటి నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో ఆయన విస్తృతంగా చర్చించారు. వంతెన నిర్మాణ పనులు ఇప్పటికే సుమారు 40 శాతం పూర్తయ్యాయని తెలిపారు. పైల్ క్యాప్స్, పిల్లర్లు, పియర్ క్యాప్స్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అవసరమైతే అదనపు యంత్రాలు, సిబ్బందిని వినియోగించి పనుల వేగాన్ని మరింత పెంచాలని కాంట్రాక్టింగ్ సంస్థకు సూచించారు.
మీర్ ఆలం చెరువులోకి ఒక్క చుక్క శుద్ధి చేయని మురుగు నీరు కూడా చేరకుండా సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని జలమండలి అధికారులను ఎండీ ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న రెండు ఎస్టీపీల సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతో పాటు పంపింగ్ వ్యవస్థ, డ్రైనేజీ నెట్‌వర్క్‌ను సమర్థంగా ఉపయోగించేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. వర్షపు నీటి కాలువలను మురుగునీటి నాలాల నుంచి పూర్తిగా వేరు చేయాలని స్పష్టం చేశారు.
వంతెన నిర్మాణం పూర్తయ్యే నాటికే చెరువు ప్రక్షాళన పనులను కూడా పూర్తి చేయాలని ఆయన నిర్దేశించారు. ఇందుకోసం వెంటనే చెరువు శుభ్రపరిచే కార్యక్రమాలు ప్రారంభించాలని సూచించారు. అలాగే చెరువులోని రెండు దీవుల అభివృద్ధి పనులను కూడా వంతెన నిర్మాణంతోపాటే సమాంతరంగా చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేలా, పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా ఆధునిక మౌలిక వసతులను కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంఆర్డీసీఎల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పి. గౌతమి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (టెక్నికల్) సత్యనారాయణ, చీఫ్ ఇంజనీర్ కె. సురేష్ కుమార్, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్, ఎంఆర్డీసీఎల్ ఈడీ ఎస్. శ్రీనివాస్ రెడ్డి, ప్రాజెక్ట్ కోఆర్డినేషన్ డైరెక్టర్ బి. హరినాథ్ రెడ్డి, జలమండలి చీఫ్ జనరల్ మేనేజర్ పద్మజ నేతృత్వంలోని బృందం, పీఎంసీ ప్రతినిధులు, నిర్మాణ కాంట్రాక్టర్ల బృందం పాల్గొన్నారు.






