TGICET: టీజీఐసెట్-2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. జులై 31 నుంచే ప్రక్రియ ప్రారంభం!

by Ramesh Naini |

రాష్ట్రంలోని యూనివర్శిటీలు, ప్రైవేటు కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీఐసెట్ 2026 అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది.

TGICET: టీజీఐసెట్-2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. జులై 31 నుంచే ప్రక్రియ ప్రారంభం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని యూనివర్శిటీలు, ప్రైవేటు కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీఐసెట్ 2026 అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. సోమవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈ సమావేశంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, అడ్మిషన్ల కన్వీనర్ ఎ. శ్రీదేవసేనతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఐసెట్ మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జూలై 31న ప్రారంభమై ఆగస్టు 14 వరకు కొనసాగనుంది. విద్యార్థుల సౌకర్యార్థం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 22 హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. యూనివర్సిటీలు, ప్రైవేట్ అన్-ఎయిడెడ్ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను ఆగస్టు 24 న అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నట్లు కన్వీనర్ తెలిపారు. అభ్యర్థులు నోటిఫికేషన్, హెల్ప్‌లైన్ సెంటర్ల జాబితా, కౌన్సెలింగ్ సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://tgicet.nic.in చూడవలసిందిగా సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఎ. శ్రీదేవసేన కోరారు. విద్యార్థులు, తల్లిదండ్రులు సకాలంలో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.

మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే:

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్: జూలై 31 నుంచి ఆగస్టు 5 వరకు

సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ : ఆగస్టు 1 నుంచి 5 వరకు

వెబ్ ఆప్షన్ల ఎంపిక : ఆగస్టు 3 నుంచి 8 వరకు

ఆప్షన్ల ఫ్రీజింగ్ : ఆగస్టు 8

మొదటి విడత సీట్ల కేటాయింపు : ఆగస్టు 11న లేదా అంతకు ముందు

ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్: ఆగస్టు 11 నుంచి 14 వరకు

చివరి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్:

మొదటి విడతలో హాజరుకాని వారి కోసం ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్, ఫీజు చెల్లింపు: ఆగస్టు 17

సర్టిఫికెట్ వెరిఫికేషన్: ఆగస్టు 18

వెబ్ ఆప్షన్ల నమోదు: ఆగస్టు 18 నుంచి 19 వరకు

ఆప్షన్ల ఫ్రీజింగ్: ఆగస్టు 19

చివరి విడత సీట్ల కేటాయింపు: ఆగస్టు 22న లేదా అంతకు ముందు

ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్: ఆగస్టు 22 నుంచి 24 వరకు

కేటాయించిన కాలేజీల్లో రిపోర్టింగ్ : ఆగస్టు 22 నుంచి 25 వరకు

Next Story