బిల్లుడు దుంగల అక్రమ రవాణాకు బ్రేక్.. యానంబైల్ రేంజ్‌లో అటవీశాఖ మెరుపు దాడి

by Kodari Anjali |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యానంబైల్ వైల్డ్‌లైఫ్ రేంజ్ పరిధిలో అటవీ సంపదను అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్ల యత్నాన్ని అటవీ శాఖ అధికారులు భగ్నం చేశారు.

బిల్లుడు దుంగల అక్రమ రవాణాకు బ్రేక్.. యానంబైల్ రేంజ్‌లో అటవీశాఖ మెరుపు దాడి
X

దిశ, పాల్వంచ టౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యానంబైల్ వైల్డ్‌లైఫ్ రేంజ్ పరిధిలో అటవీ సంపదను అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్ల యత్నాన్ని అటవీ శాఖ అధికారులు భగ్నం చేశారు. ఉల్వనూర్ నుంచి పాల్వంచకు బిల్లుడు దుంగలను అక్రమంగా తరలిస్తున్న మహీంద్రా బొలెరో వాహనాన్ని వైల్డ్‌లైఫ్ రేంజర్ కవిత మాధురి ఆధ్వర్యంలో బేస్ వాచర్ల సహకారంతో అటవీ శాఖ అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. అధికారుల కథనం ప్రకారం, ఉల్వనూర్ ప్రాంతం నుంచి పాల్వంచకు బిల్లుడు దుంగలను అక్రమంగా తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో వైల్డ్‌లైఫ్ రేంజర్ కవిత మాధురి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. బేస్ వాచర్ల సమాచారంతో అప్రమత్తమైన అటవీ శాఖ బృందం మార్గమధ్యంలో మహీంద్రా బొలెరో వాహనాన్ని అడ్డగించి తనిఖీ చేయగా, అందులో అక్రమంగా తరలిస్తున్న బిల్లుడు దుంగలను గుర్తించారు. దీంతో వాహనంతో పాటు దుంగలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

నిరంతర తనిఖీలు నిర్వహిస్తాం..

ఈ ఘటనపై సంబంధిత అటవీ చట్టాల కింద కేసు నమోదు చేసిన అధికారులు, అక్రమ రవాణాకు పాల్పడిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బిల్లుడు దుంగలను ఎక్కడి నుంచి నరికివేశారు, ఎక్కడికి తరలిస్తున్నారు, ఈ అక్రమ రవాణా వెనుక సంఘటిత ముఠా ఉందా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైల్డ్‌లైఫ్ రేంజర్ కవిత మాధురి మాట్లాడుతూ, అటవీ సంపదను అక్రమంగా నరికివేయడం, రవాణా చేయడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. రిజర్వ్ అటవీ ప్రాంతాల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేసి, బేస్ వాచర్లు, ఫీల్డ్ సిబ్బందితో కలిసి నిరంతర తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. అటవీ సంపదను దోచుకునే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు కూడా అటవీ సంపద పరిరక్షణలో భాగస్వాములు కావాలని, అనుమానాస్పదంగా చెక్క దుంగల రవాణా కనిపించిన వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Next Story