- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రారంభానికి సిద్ధమైన భోగాపురం ఎయిర్‌పోర్టు.. చంద్రబాబు కీలక ఆదేశాలు
ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయం ప్రారంభంకానుంది. దీంతోఉన్నతాధికారులు, ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ..

దిశ, వెబ్ డెస్క్: ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయం ప్రారంభంకానుంది. దీంతోఉన్నతాధికారులు, ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. "ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు" అనే నినాదంతో ఈ వేడుకలను చేపట్టాలని ఆదేశించారు. భోగాపురం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రకు 'గేమ్‌ఛేంజర్'గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం ఏర్పాట్లలో పోటీతత్వంతో పని చేసి, ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ వేడుకల్లో యువత, విద్యార్థులను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని సూచించారు. యువకుల కోసం వాలీబాల్, రన్, పాటలు, పద్యాల పోటీలు నిర్వహించాలని చెప్పారు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఎయిర్‌పోర్టు వల్ల కలిగే ప్రయోజనాలపై క్విజ్, డ్రాయింగ్, వ్యాసరచన పోటీలు పెట్టాలన్నారు. ప్రతిభ కనబరిచిన 600 మందిని విజేతలుగా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈనెల 31న రాత్రి ప్రత్యేకంగా డ్రోన్ షోను ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.
ఈ ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధానమంత్రికి జాతీయ జెండాలతో విద్యార్థులు ఘన స్వాగతం పలికేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. 13 వేల మంది కళాకారులతో సాంప్రదాయ 'థింసా' నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరొకవైపు ప్రస్తుత కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, విమానాశ్రయానికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేసేందుకు భారీ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు 11 అంతర్జాతీయ, 25 జాతీయ ఛానళ్లు సిద్ధమయ్యాయన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రగతికి సరికొత్త బాటలు వేసే ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించేందుకు అన్ని శాఖలను సమాయత్తం చేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.






