‘కుడా’లో భూముల వేలం రగడ.. దేవాలయం వేదికగా సవాళ్లు!

by Jakkula.Mamatha |

వరంగల్ కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో జరిగిన భూముల వేలం వ్యవహారం నగరంలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీస్తోంది

‘కుడా’లో భూముల వేలం రగడ.. దేవాలయం వేదికగా సవాళ్లు!
X

వరంగల్ నగరంలో కుడా భూముల వేలం వ్యవహారం ప్రధాన రాజకీయ పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. హసన్‌పర్తి, ఎల్కతుర్తి పరిధిలో రైతుల నుంచి సేకరించిన 225ఎకరాల వేలంతో కుడాకు రూ.100కోట్ల ఆదాయం వచ్చింది. ఈ వేలం ప్రక్రియలో భారీగా అవినీతి, అవకతవకలు జరిగాయని విపక్షాలు ఆరోపిస్తూ ఆందోళనలు చేపట్టాయి. ఆరోపణలను తిప్పికొట్టిన అధికార పక్షం.. గత ప్రభుత్వ హయాంలోనే కుడా నిధులు దారిమళ్లాయని ఆరోపించింది. ఈ వివాదం కాస్తా భద్రకాళి అమ్మవారి ఆలయంలో తడిబట్టలతో ప్రమాణాలు చేసుకునే స్థాయికి చేరింది. రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు ఈ అంశాన్ని వాడుకుంటున్నాయి. ఎన్నికలకు ముందే రాజకీయ వాతావరణం వేడెక్కడంతో నగరంలో భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయోనని సీనియర్లు ఆందోళన పడుతున్నారు.

దిశ, వరంగల్ బ్యూరో: వరంగల్ కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో జరిగిన భూముల వేలం వ్యవహారం నగరంలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలోని హసన్‌పర్తి, ఎల్కతుర్తి, దామెర మండలాల్లో రైతుల నుంచి సేకరించిన 225 ఎకరాల భూమిని ప్లాట్లుగా మార్చి అధికారులు వేలం వేశారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి వంద కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. అయితే, ఈ వేలంలో భారీగా అవకతవకలు జరిగాయని, పారదర్శకత లోపించి పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయని విపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆరోపిస్తూ సమగ్ర దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నారు.

సవాళ్లు - ప్రతిసవాళ్లు..

విపక్షాల విమర్శలను అధికార పక్షమైన కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తిప్పికొట్టారు. వేలం అంతా నిబంధనల ప్రకారమే పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేస్తూ గత బీఆర్ఎస్ హయాంలోనే కుడా నిధులు రూ.45కోట్లు దారిమళ్లాయంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య వివాదం ముదిరి, చివరకు భద్రకాళి అమ్మవారి దేవాలయం వేదికగా తడిబట్టలతో ప్రమాణ స్వీకారాలు చేసే సవాళ్ల వరకు వెళ్లింది. ఉభయ పక్షాల నేతలు ఆలయానికి బయలుదేరడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు.

గ్రేటర్ ఎన్నికలే ఎజెండాగా..

రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే, ప్రధాన పార్టీలు ఈ వివాదాన్ని ఒక ఎజెండాగా మార్చుకుంటూ ముందుకు సాగుతున్నాయి. కుడా పరిధిలోని వందలాది గ్రామాల్లో రియల్ ఎస్టేట్, భవన నిర్మాణాల జోరు సాగుతుండటంతో విలువైన భూముల వ్యవహారం ఇప్పుడు ప్రధాన రాజకీయ అస్త్రంగా మారింది. నగర ప్రగతిని తామే చేస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతుండగా, గత రెండున్నరేళ్లుగా నగరానికి కొత్తగా వచ్చిన నిధులు ఏవీ లేవని, అభివృద్ధి శూన్యమని విపక్షాలు మండిపడుతున్నాయి.

నేతల్లో ఆందోళన..

ఎన్నికలకు ముందే ఈ భూముల వేలం అంశం రాజకీయంగా బాగా వేడెక్కించడంతో స్థానిక డివిజన్ల పరిధిలోని ద్వితీయ శ్రేణి నేతలు ఆందోళన చెందుతున్నారు. ఎవరికి వారే డివిజన్ల పరిధిలో నాజర్ పెట్టి పనులు చేసుకుంటున్నారు. అయినప్పటికీ, ఈ రాజకీయ వాతావరణం భవిష్యత్తులో ఏ మలుపు తిరుగుతుందో, ఎవరికి చుట్టుకుంటుందోనని సీనియర్ నాయకులు సైతం లెక్కలు వేసుకుంటున్నారు. భూముల వేలం ద్వారా వచ్చే వంద కోట్ల ఆదాయంతో నగరం పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సిద్ధమవుతుండగా, ఈ వివాదం మాత్రం రోజురోజుకూ ముదురుతోంది.

Next Story