టీచర్లకు బ్రేక్‌ఫాస్ట్, లంచ్ పై వెల్లువెత్తుతున్న నిరసనలు

by Muthe.Rajitha |

విద్యార్థులతో పాటు స్కూల్స్ లో పనిచేసే టీచర్లకు కూడా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అందించాలనే ప్రభుత్వ ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టీచర్లకు బ్రేక్‌ఫాస్ట్, లంచ్ పై వెల్లువెత్తుతున్న నిరసనలు
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం(Mid Day Meals) అమలు చేస్తుండగా.. బ్రేక్‌ఫాస్ట్ పథకం కూడా అమలు చేయాలని ఇటీవలే రాష్ట్ర కేబినేట్ తీర్మానం చేసింది. అయితే ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు కూడా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ పెట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ నిర్ణయం తీవ్ర వివాదానికి దారి తీస్తోంది. విద్యార్థులతో పాటు స్కూల్స్ లో పనిచేసే టీచర్లకు కూడా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అందించాలనే ప్రభుత్వ ప్రతిపాదనపై విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల నుంచి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టీచర్ల గౌరవాన్ని తగ్గించడమే : ఉపాధ్యాయ సంఘాలు

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందంటూ పీఆర్టీయూ (PRTU), ఎస్టీయూటీఎస్ (STUTS) వంటి ప్రముఖ ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఉపాధ్యాయులను పిల్లలతో సమానంగా చూస్తూ వారికి స్కూళ్లలోనే ఉచిత భోజనం పెట్టాలని అనుకోవడం వారిని అవమానించడమేనని మండిపడ్డాయి. ఉపాధ్యాయులకు ఉచిత బ్రేక్‌ఫాస్ట్, మిడ్ డే మీల్స్ అవసరం లేదని స్పష్టం చేశారు. టీచర్లపై అనవసరంగా ఇలాంటి పథకాలను రుద్దే బదులు.. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వారి జీతాలు, అలవెన్సులు పెంచాలని, పాఠశాలల్లో పని భారాన్ని తగ్గించాలని ప్రభుత్వానికి సూచించారు.

ఆ ఖర్చు కూడా పిల్లలకే పెట్టండి : హర్షవర్ధన్ రెడ్డి

ఈ వివాదంపై టీపీసీసీ (TPCC) అధికార ప్రతినిధి, పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి స్పందిస్తూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉపాధ్యాయులకు ఉచితంగా భోజనాలు పెట్టడానికి వెచ్చించే నిధులను కూడా విద్యార్థులకే కేటాయించాలన్నారు. తద్వారా పిల్లలకు మరింత మెరుగైన, నాణ్యమైన పోషకాహారాన్ని అందించడానికి వీలవుతుందని హితవు పలికారు. ఉపాధ్యాయుల సెంటిమెంట్‌ను గౌరవించి, ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రభుత్వం సమర్థన..

అయితే, ఈ విమర్శలపై ప్రభుత్వ వర్గాలు భిన్నంగా స్పందించాయి. ఉపాధ్యాయులను అవమానించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశాయి. ఉపాధ్యాయుల ఆరోగ్యం, వారి పని సామర్థ్యాన్ని (Productivity) పెంపొందించాలనే మంచి లక్ష్యంతోనే కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. సుదూర ప్రాంతాల నుండి ఉదయాన్నే పాఠశాలలకు వచ్చే ఉపాధ్యాయులకు ఇది ఎంతోకొంత మేలు చేస్తుందని ప్రభుత్వం సమర్థించుకుంటోంది. అయినప్పటికీ, ఉపాధ్యాయ లోకం నుండి వ్యతిరేకత తీవ్రమవడంతో ఈ పథకం అమలుపై ప్రభుత్వం ముందడుగు వేస్తుందా లేదా వెనక్కి తగ్గుతుందా అనేది వేచి చూడాలి.

Next Story