- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్క ఉద్యోగి రాకపోతే పార్కుకే తాళం..?
ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పార్కుకు తాళం వేసి మూసివేయడం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని స్థానికులు మండిపడుతున్నారు.

దిశ,మేడిపల్లి: ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పార్కుకు తాళం వేసి మూసివేయడం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని స్థానికులు మండిపడుతున్నారు. బోడుప్పల్ సర్కిల్ మారుతీనగర్ పార్కు శనివారం మూసివేయడంతో ఉదయం వాకింగ్‌కు వచ్చిన వృద్ధులు, మహిళలు, పిల్లలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పీర్జాదిగూడ మున్సిపాలిటీ బోడుప్పల్ సర్కిల్ గా మారి నెలలు గడిచినా, పార్కు వద్ద ఇప్పటికీ పాత బోర్డే కొనసాగుతుండడం అధికారుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. బోర్డు మార్పు వంటి సాధారణ పనిని కూడా పూర్తి చేయలేకపోయిన అధికారులు, ఇప్పుడు పార్కును పూర్తిగా మూసివేయడం విమర్శలకు తావిచ్చింది.
ఈ విషయమై స్థానికులు వార్డు అధికారిని ప్రశ్నించగా.. పార్కు నిర్వహణ బాధ్యతలు చూసే ఉద్యోగికి తీవ్ర జ్వరం ఉండటంతో విధులకు రాలేదని సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఒక ఉద్యోగి రాకపోతే మిగిలిన సిబ్బంది, సూపర్వైజర్లు, ఇతర అధికారులు ఏమి చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఒకరి గైర్హాజరుతో ప్రజా సౌకర్యాన్ని పూర్తిగా నిలిపివేయడం పరిపాలనా వైఫల్యమేనని విమర్శిస్తున్నారు.ప్రజల కోసం ఏర్పాటు చేసిన పార్కును నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న సంబంధిత అధికారులపై ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యామ్నాయ నిర్వహణ వ్యవస్థను అమలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






