- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగుస్తున్న ఉచ్చు.. దూలపల్లిలో భూ ఆక్రమణలపై కదులుతున్న డొంక!
భూ అక్రమణదారులకు ఉచ్చు బిగుస్తోంది.

దిశ, మేడ్చల్ బ్యూరో: భూ అక్రమణదారులకు ఉచ్చు బిగుస్తోంది. దశాబ్దాలుగా సాగుతున్న వ్యవస్థీకృత భూ కుంభకోణంపై ఎట్టకేలకు డొంక కదులుతోంది. దుండిగల్ గండిమైసమ్మ మండలం, దూలపల్లి గ్రామంలో ‘ప్రజావాణి’ వేదికగా బాధితులు ఆధారాలతో సహా సమర్పించిన సంచలన ఫిర్యాదుతో అటు రెవెన్యూ యంత్రాంగం లోనూ, ఇటు నిఘా వర్గాలలోనూ తీవ్ర చలనం మొదలైనట్లు తెలుస్తోంది. దూలపల్లి భూ మాఫియా వెనుక ఉన్న సూత్రధారులు, వారికి సహకరించిన అధికారుల గుట్టురట్టు బయటకు తీసేందుకు ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగి పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో, ఒకదాని వెనుక ఒకటిగా ఈ భూదందాకు సంబంధించిన నమ్మశక్యం కానీ నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
భూ మాయ..
అక్రమ భూపరిహారం మొదలుకొని.. సర్వే నెంబర్ 155, 156ల అక్రమాల తంతు!. ఈ కుంభకోణంలో ప్రధానంగా రోడ్డు విస్తరణ పేరుతో జరిగిన ప్రభుత్వ భూమి కేటాయింపులు, పరిహారాల దందా విస్మయానికి గురి చేస్తోంది. స్టీల్ సిటీ రోడ్డు నిర్మాణ బాధితుల క్లెయిమ్స్ ఆధారంగా సాగిన అక్రమ భూపరిహారం వ్యవహారంపై అధికారులు ఇప్పుడు లోతుగా దృష్టి సారించారు. దీనితో పాటు, వివాదం కేవలం సర్వే నెంబర్ 154కే పరిమితం కాకుండా పక్కనే ఉన్న సర్వే నంబర్లు 155, 156లకు సైతం పాకినట్లు తెలుస్తోంది. ఈ సర్వే నంబర్లలో ఎలాంటి చట్టబద్ధమైన టైటిల్స్, యాజమాన్య హక్కులు లేకపోయినప్పటికీ.. భారీ ఎత్తున నకిలీ పత్రాలు, చెల్లని జీపీఏలను సృష్టించి అక్రమ లేఅవుట్లను ఏర్పాటు చేసినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అనధికారికంగా గజాల లెక్కన ప్లాట్లను విభజించి, అమాయక కొనుగోలుదారులను ముంచడమే కాకుండా, అసలైన యజమానులను బెదిరింపులకు గురిచేస్తూ ఈ అక్రమ లేఅవుట్ల తంతును యథేచ్ఛగా నడిపించినట్లు నిఘా వర్గాల ప్రాథమిక పరిశీలనలో తేలింది.
నిర్మాణాలు తొలగించాలని కోర్టు తీర్పు?
భూ మాఫియా సృష్టించిన నకిలీ పత్రాల వల్ల తాము సర్వస్వం కోల్పోతున్నామని, తమ సొంత భూముల్లో అక్రమంగా లేఅవుట్లు వేసి వేధింపులకు గురిచేస్తున్నారని గ్రహించిన స్థానిక రైతులు, అసలైన భూ యజమానులు చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. భూ మాఫియా సాగించిన అక్రమ విక్రయాలు, అనుమతులు లేని కట్టడాలపై సుదీర్ఘంగా విచారణ జరిపిన కోర్టు బాధితుల పక్షాన నిలిచిందని, ఆయా వివాదాస్పద సర్వే నంబర్లలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన అనధికారిక నిర్మాణాలను తక్షణమే తొలగించాలని న్యాయస్థానం స్పష్టమైన తీర్పులు జారీ చేసిందని చెబుతున్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, స్థానిక యంత్రాంగం ఇన్నాళ్లూ నిర్లిప్తంగా వ్యవహరించడం వెనుక ఉన్న అంతర్గత కారణాలపై ఇప్పుడు ఉన్నతాధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు.
ఉచ్చు బిగిస్తున్న యంత్రాంగం..
కలెక్టరేట్‌లో అందిన పక్కా ఆధారాల నేపథ్యంలో, 1981 నుంచి దూలపల్లి రెవెన్యూ రికార్డుల్లో జరిగిన ప్రతి మార్పును రీ-వెరిఫికేషన్ చేయాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. తప్పుడు ఓఆర్‌సీలు, చెల్లని జీపీఏల ఆధారంగా సాగిన రిజిస్ట్రేషన్ల రద్దుతో పాటు, అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇంటెలిజెన్స్ రంగ ప్రవేశంతో దూలపల్లి భూ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ భారీ కుంభకోణంలో ఎంతటి పెద్దలున్నా వదిలిపెట్టేది లేదని, త్వరలోనే పూర్తి నివేదిక ఆధారంగా కఠిన చర్యలు ఉంటాయని రెవెన్యూ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా దూలపల్లి గ్రామ రెవెన్యూ వివిధ సర్వే నంబర్ల పరిధిలో జరిగిన ఒక్కొక్క అక్రమాన్ని సాక్ష్యాధారాలతో సహా మరిన్ని అంశాలను ‘దిశ’ పత్రిక మరొక కథనంలో తీసుకురానుంది.






