విడుదలకు ముందే హిట్ వైపు 'నాగబంధం'.. మేకర్స్ అమలు చేసిన సీక్రెట్ ఫార్ములా ఏంటి?

by Pulgam srinivas |

రూ.100 కోట్ల బడ్జెట్‌లో ఎక్కువ భాగం మేకింగ్, వీఎఫ్‌ఎక్స్‌పై ఖర్చు చేయడం వల్ల 'నాగబంధం' సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

విడుదలకు ముందే హిట్ వైపు నాగబంధం.. మేకర్స్ అమలు చేసిన సీక్రెట్ ఫార్ములా ఏంటి?
X

దిశ, వెబ్ డెస్క్: ఇండస్ట్రీలో కొన్ని సినిమాలకు మాత్రమే విడుదలకు ముందే మంచి బిజినెస్ జరిగి, నిర్మాతలు లాభాల బాట పడుతుంటారు. అయితే నిర్మాత లాభాల్లోకి వెళ్లాలంటే సినిమాపై అంచనాలు పెరగడం మాత్రమే కాదు, సినిమా బడ్జెట్ కూడా నియంత్రణలో ఉండాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే బడ్జెట్ కంట్రోల్‌లో ఉంటే, ప్రీ-రిలీజ్ బిజినెస్ ద్వారానే సినిమా లాభాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అదే భారీ బడ్జెట్‌తో సినిమా రూపొందితే మంచి హైప్ ఉన్నప్పటికీ రికవరీ ఆ స్థాయిలో జరగకపోవచ్చు. దీంతో నిర్మాతలు సినిమా విడుదల వరకు లాభాల్లోకి వెళ్లే అవకాశం తగ్గుతుంది.

ఇక తాజాగా విరాట్ కర్ణ హీరోగా, నభా నటేష్ మరియు ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా అభిషేక్ నామ దర్శకత్వంలో రూపొందిన 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' చిత్రం ఇప్పటికే మంచి అంచనాలను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని నిషితా నాగిరెడ్డి, కిషోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్నారు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా విడుదలకు ముందే లాభాల బాట పట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. విరాట్ కర్ణ పెద్ద స్టార్ హీరో కాకపోవడం, దర్శకుడు అభిషేక్ నామకు కూడా భారీ అనుభవం లేకపోవడం వంటి అంశాలు ఉన్నప్పటికీ, ఈ సినిమాపై ఆసక్తి పెరగడానికి ప్రధాన కారణం దాని విజువల్ క్వాలిటీ అని చెబుతున్నారు.

భారీ వీఎఫ్‌ఎక్స్ సన్నివేశాలతో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే మొత్తం బడ్జెట్‌లో దాదాపు 90 శాతం వరకు మేకింగ్‌పైనే ఖర్చు చేసినట్లు సమాచారం. దీంతో సినిమా క్వాలిటీ విషయంలో ప్రేక్షకుల్లోనే కాకుండా ఇండస్ట్రీ వర్గాల్లో కూడా మంచి నమ్మకం ఏర్పడింది. ఈ కారణాల వల్లే 'నాగబంధం'కు విడుదలకు ముందే మంచి బిజినెస్ జరిగి, దాదాపు లాభాల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో అన్న ఆసక్తి ప్రస్తుతం సినీ వర్గాల్లో నెలకొంది.

Next Story