హోంగార్డుల అన్యాయ బదిలీలను రద్దు చేయాలి

by Ratna Kumari |

రాష్ట్రంలో ప్రజల భద్రత కోసం రాత్రింబవళ్లు సేవలందిస్తున్న హోంగార్డులను అన్యాయంగా ఇబ్బందులకు గురిచేయడం సరికాదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.

హోంగార్డుల అన్యాయ బదిలీలను రద్దు చేయాలి
X

దిశ, హుజూరాబాద్ రూరల్ : రాష్ట్రంలో ప్రజల భద్రత కోసం రాత్రింబవళ్లు సేవలందిస్తున్న హోంగార్డులను అన్యాయంగా ఇబ్బందులకు గురిచేయడం సరికాదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. తెలంగాణ డీజీపీ వెంటనే జోక్యం చేసుకుని హోంగార్డుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హుజూరాబాద్ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన మంగళవారం ఒక వీడియో విడుదల చేశారు.

వందల కిలోమీటర్ల బదిలీలతో తీవ్ర ఇబ్బందులు..

రాష్ట్రంలో సుమారు 16 వేల మంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 1,100 మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. నెలకు సుమారు రూ.30 వేల స్వల్ప వేతనంతో కుటుంబాలను పోషిస్తున్న హోంగార్డులను వందల కిలోమీటర్ల దూరాలకు బదిలీ చేయడం వల్ల వారు తీవ్ర ఆర్థిక, కుటుంబ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హుజూరాబాద్, వేములవాడ, మంథని, సిరిసిల్ల తదితర ప్రాంతాల మధ్య హోంగార్డులను తరచూ బదిలీ చేయడం వల్ల వారి జీవనం భారంగా మారిందన్నారు. అంత తక్కువ జీతంతో ప్రతిరోజూ దూరప్రాంతాలకు ప్రయాణించడం సాధ్యం కాదని, మానవీయ కోణంలో ఆలోచించి ఈ బదిలీలను వెంటనే పునఃసమీక్షించాలని డీజీపీని కోరారు.

అక్రమ వసూళ్లపై సమగ్ర విచారణ జరపాలి..

గతంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో హోంగార్డుల నుంచి అక్రమ వసూళ్లు జరిగినట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బెదిరింపులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం..

ప్రస్తుతం కొంతమంది హోంగార్డులను ప్రతిపక్ష నాయకులను కలిశారనే నెపంతో బెదిరింపులకు గురిచేస్తున్నారని, వారి వివరాలు సేకరించాలని ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, ఉద్యోగుల మనోధైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని విమర్శించారు. హోంగార్డులను వీలైనంత వరకు వారి సొంత జిల్లాల్లో లేదా కొత్త జిల్లా పరిధిలోనే విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, అన్యాయ బదిలీలను వెంటనే రద్దు చేసి వారికి న్యాయం చేయాలని డీజీపీని కోరారు.

Next Story