మీడియాపై ఆంక్షలు.. అభివృద్ధి పనులపై కౌన్సిలర్ల ఆగ్రహం...

by Batti.Sumithra |

మున్సిపల్ సమావేశానికి మీడియా పై ఆంక్షలు పెట్టడం పై కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీడియాపై ఆంక్షలు.. అభివృద్ధి పనులపై కౌన్సిలర్ల ఆగ్రహం...
X

దిశ, మెదక్ టౌన్ : మున్సిపల్ సమావేశానికి మీడియా పై ఆంక్షలు పెట్టడం పై కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం చైర్‌పర్సన్ రాధిక భూపతిరాజ్ అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు తమ వార్డుల సమస్యలను ప్రస్తావిస్తూ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 9వ వార్డు కౌన్సిలర్ జుబేర్ అహ్మద్ మాట్లాడుతూ సమావేశంలో మీడియా ప్రతినిధులు ఫోటోలు, వీడియోలు తీయవద్దని చెప్పడం వారి హక్కులను హరించడమేనని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో చైర్‌పర్సన్ రాధిక తన పేరును పొరపాటున "షమీ"గా సంబోధించగా, "నా పేరు జుబేర్ మేడమ్" అని ఆయన సరిదిద్దారు. కౌన్సిలర్ పేరు గుర్తు లేకపోవడంపై సమావేశంలో చర్చ జరిగింది. 29వ వార్డు కౌన్సిలర్ బట్టి ఉదయ్ మాట్లాడుతూ మీడియా పై ఆంక్షలు విధించడం సమంజసం కాదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే సమావేశాల్లో వీడియోలు తీయడానికి మీడియాకు అనుమతి ఇవ్వాలని కోరారు.

తమ వార్డులో నీటి సమస్య పరిష్కారానికి అమృత్ పథకం నిధులను వినియోగించాలని సూచించారు. వార్డు సమస్యలపై మాట్లాడేందుకు కమిషనర్‌కు ఫోన్ చేస్తే కనీసం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో చైర్‌పర్సన్‌కు, అధికారులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. మున్సిపాలిటీకి సొంత జేసీబీ ఉన్నప్పటికీ ప్రైవేట్ జేసీబీకి రూ.2 లక్షలు ఖర్చు చేశారని ఆరోపించారు. అలాగే పంచర్ మరమ్మతులకు రూ.40 వేల, ఈ నెల రూ.20 వేల ఖర్చు చేయడాన్ని చూస్తే కౌన్సిలర్ కంటే పంచర్ షాప్ పెట్టుకోవడమే బెటర్ అని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కౌన్సిలర్ గౌస్ ఖురేషి మాట్లాడుతూ గత సమావేశంలో తమ వార్డును పరిశీలిస్తామని చెప్పిన చైర్‌పర్సన్, కమిషనర్ ఇప్పటివరకు రాలేదన్నారు. వర్షాకాలంలో తమ వార్డులోని చమన్ ప్రాంతంలో చిన్న వర్షానికే మోకాలి లోతు వరకు నీరు నిలుస్తోందని, వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. బోనాల సందర్భంగా అన్ని బ్యానర్లు తొలగించి ఒక బ్యానర్ మాత్రమే ఉంచడం సరైంది కాదన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నవీన్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story