వెస్టిండీస్‌పై ఘన విజయం.. మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా

by Kema Shiva Kumar |

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా జేత్రయాత్ర కొనసాగింది.

వెస్టిండీస్‌పై ఘన విజయం.. మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా
X

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియా మహిళల జట్టు మరోసారి అదరగొట్టింది. లండన్‌లోని ప్రసిద్ధ ‘ది ఓవల్’ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ పోరులో వెస్టిండీస్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, కంగారు జట్టు ఫైనల్లోకి అడుగుపెట్టింది. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో వెస్టిండీస్ 7 వికెట్ల నష్టానికి కేవలం 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ హేలీ మాథ్యూస్ (30), చివర్లో డియాండ్రా డాటిన్ (26) మాత్రమే కాస్త నిలకడగా ఆడారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆష్లీ గార్డనర్ 2, సోఫీ మోలినాక్స్ 2, జార్జియా వేర్‌హామ్, వికెట్లు తీసుకున్నారు.

బెత్ మూనీ విధ్వంసం.. వార్ వన్ సైడ్

126 పరుగుల స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు వెస్టిండీస్ బౌలర్లను ఉతికారేశారు. ముఖ్యంగా ఓపెనర్ బెత్ మూనీ ఆరంభం నుంచే విండీస్ బౌలర్లపై విరుచుకుపడింది. కేవలం 13 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసి ఆస్ట్రేలియా విజయాన్ని అందుకుంది. బెత్ మూనీ కేవలం 36 బంతుల్లోనే 61 పరుగులతో అజేయంగా నిలవగా, ఆల్ రౌండర్ ఆష్లీ గార్డనర్ 20 బంతుల్లో 35 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. వెస్టిండీస్ బౌలర్లలో చినెల్ హెన్రీ, హేలీ మాథ్యూస్‌లకు తలా ఒక వికెట్ దక్కింది. ఇక ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 35 పరుగులు, 2 వికెట్ల తీసిన ఆష్లీ గార్డనర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో 6 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా మరోసారి పొట్టి ప్రపంచకప్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది.

Next Story