- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్కు స్థలానికి హైడ్రా ఫెన్సింగ్
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, మేడిపల్లి మండలం, బోడుప్పల్ గ్రామ పరిధిలోని టెలిఫోన్ కాలనీలో ఉన్న1166 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా మంగళవారం కాపాడింది.

దిశ, తెలంగాణ బ్యూరో : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, మేడిపల్లి మండలం, బోడుప్పల్ గ్రామ పరిధిలోని టెలిఫోన్ కాలనీలో ఉన్న1166 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా మంగళవారం కాపాడింది. పార్కును కాపాడి.. 3 వేల కుంటుంబాలు, 10 వేల మంది నివాసితులకు హైడ్రా ప్రాణవాయువును అందించింది. వివరాల్లోకి వెళ్తే.. 1974లో గ్రామపంచాయతీ లే ఔట్‌గా టెలిఫోన్ కాలనీ ఏర్పడింది. ఇందులో 1166 గజాల స్థలాన్ని పార్కుగా కేటాయించారు. ఈ పార్కు స్థలాన్ని 6 బాగాలుగా చేసి కబ్జాలకు అక్కడ కొంతమంది ప్రయత్నించారు. కాలనీవాసులు పార్కుగా అభివృద్ధి చేస్తుంటే.. కబ్జాదారులు ఆటంకాలు సృష్టిస్తూ వచ్చారు. ఇదే విషయమై హైడ్రా ప్రజావాణిలో టెలిఫోన్ కాలనీ నివాసితులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను హైడ్రా లోతుగా విచారించింది. సంబంధిత శాఖలతో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించింది. బోడుప్పల్ గ్రామంలోని సర్వే నంబరు 78, 79లో ఈ కాలనీ ఏర్పడినట్టు నిర్ధారించింది. గ్రామపంచాయతీ లే ఔట్ అయినప్పటికీ ఇందులో ప్లాట్లు, భవనాలకు ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ అనుమతులు కూడా మంజూరయ్యాయి.
పార్కు పక్కనే ఉన్న ప్లాట్ల సేల్ డీడ్‌లను పరిశీలించగా.. పార్కు స్థలం హద్దులున్నట్టు నిర్ధారణ అయ్యింది. ఆమోదిత లేఅవుట్, రిజిస్టర్డ్ పత్రాలు, క్షేత్రస్థాయి పరిశీలన, కాలనీ నివాసుల వాంగ్మూలాల ఆధారంగా 1,166 చదరపు గజాల ఈ స్థలం పూర్తిగా పార్కు స్థలమేనని హైడ్రా నిర్ధారించింది. ఆక్రమణదారులు ఏర్పాటు చేసిన అనధికారిక ఫెన్సింగ్‌ను హైడ్రా తొలగించింది. పార్కు స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. అలాగే హద్దులు నిర్ధారించి హైడ్రా ఫెన్సింగ్ వేసింది.






