30 రోజులు జైల్లో ఉంటే పదవి రద్దు.. ఆ రూల్ అలాగే ఉంచాలని జేపీసీ నిర్ణయం

by I. Sairam |

30 రోజుల పాటు జుడీషియల్, పోలీస్ కస్టడీలో ఉండే ప్రధాని, సీఎంలు, ఇతర మంత్రులు తమ పదవులు ఆటోమేటిక్‌గా రద్దు అయ్యేలా 130వ రాజ్యాంగ సవరణ బిల్లులో కేంద్ర ప్రతిపాదించింది. అయితే ఈ నిబంధనను అలాగే ఉంచాలని జేపీసీ నిర్ణయించింది.

30 రోజులు జైల్లో ఉంటే పదవి రద్దు.. ఆ రూల్ అలాగే ఉంచాలని జేపీసీ నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో : వివాదాస్పద 130 వ రాజ్యాంగ సవరణ బిల్లును పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తన నివేదికను జూలై 17న ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. తీవ్రమైన నేరారోపణలపై అరెస్ట్ అయి, వరుసగా 30 రోజుల పాటు జుడీషియల్ లేదా పోలీస్ కస్టడీలో ఉండే ప్రధాని, సీఎంలు, ఇతర మంత్రులు తమ పదవులు ఆటోమేటిక్‌గా రద్దు అయ్యేలా బిల్లులో ప్రతిపాదించిన నిబంధనను కమిటీ అలాగే కొనసాగించాలని నిర్ణయించింది. కీలక పదవులలో మరింత జవాబుదారీతనాన్ని తీసుకురావడమే ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం అయినప్పటికీ, రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా తప్పుడు అరెస్టుల ద్వారా ఈ నిబంధన దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆందోళనలను పరిష్కరించడానికి, అమాయకులపై ఈ నిబంధనను ప్రయోగించకుండా, రాజకీయ వేధింపులకు ఇది ఒక సాధనంగా మారకుండా నిరోధించడానికి కొన్ని రక్షణ చర్యలను సిఫార్సు చేయాలని జేపీసీ భావిస్తోంది. కాగా.. కమిటీ ఈ నివేదికను ఆమోదిస్తే, జూలై 20 నుండి ప్రారంభం కాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలోనే ప్రభుత్వం ఈ ప్రతిపాదిత బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Next Story