- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహబూబ్‌నగర్ భవిష్యత్తు కోసం పనిచేస్తా
తాను చిల్లర రాజకీయాల కోసం రాజకీయాల్లోకి రాలేదని, మహబూబ్‌నగర్ భవిష్యత్తు కోసం పనిచేయడమే తన లక్ష్యమని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

దిశ, మహబూబ్‌నగర్ ప్రతినిధి : తాను చిల్లర రాజకీయాల కోసం రాజకీయాల్లోకి రాలేదని, మహబూబ్‌నగర్ భవిష్యత్తు కోసం పనిచేయడమే తన లక్ష్యమని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహబూబ్‌నగర్ ట్రిపుల్ ఐటీలో 65 శాతం మంది విద్యార్థులు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వారే ప్రవేశాలు పొందడం తనకు ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగించిందన్నారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కోసం రూ.600 కోట్ల నిధులు మంజూరు చేయించుకోవడం కంటే ఇది మరింత ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించి, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థులకు క్యూ ఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా అందజేశామని తెలిపారు. 'శత శాతం' కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యా వాలంటీర్లను నియమించి, విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ వారిని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐఐఐటీ లక్ష్యంగా జిల్లాకు చెందిన విద్యార్థులకు 45 రోజులపాటు ప్రత్యేక శిక్షణ అందించామని, ఇందుకోసం ప్రవేశ పరీక్ష నిర్వహించి 170 మంది విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులకు అదనపు శిక్షణ అందిస్తున్నామని వివరించారు. మహబూబ్‌నగర్‌లో ప్రభుత్వ పాఠశాలలు వంద శాతం ఫలితాలు నమోదు చేయడం, జిల్లాలో 94 శాతం ఫలితాలు రావడం గర్వకారణమన్నారు. ఐఐఐటీ ప్రవేశాలకు ఈ ఏడాది దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరిగి సుమారు 33 వేల వరకు చేరిందని, గత ఏడాది 19,720 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని తెలిపారు. ఇది జిల్లాలో విద్యపై పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనమని అన్నారు. గత ఏడాది ప్రారంభమైన మూడు ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రస్తుతం సుమారు 500 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో విద్యా రంగంలో పలు సంస్కరణలు అమలు చేస్తూ గ్రామీణ విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే వివరించారు. ఈ సమావేశంలో మేయర్ మమత శ్రీనివాస్, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్‌పీ వెంకటేష్, సీజే బెనహర్ తదితరులు పాల్గొన్నారు.






