- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచ ఏరోస్పేస్ రాజధానిగా తెలంగాణ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ప్రపంచ ఏరోస్పేస్ పరిశ్రమకు తెలంగాణ కొత్త కేంద్రంగా అవతరిస్తున్నదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచ ఏరోస్పేస్ పరిశ్రమకు తెలంగాణ కొత్త కేంద్రంగా అవతరిస్తున్నదని.. ఇకపై అత్యాధునిక విమానాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, రక్షణ వ్యవస్థల తయారీలో హైదరాబాద్ ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలుస్తుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఏరోమార్ట్ హైదరాబాద్-2026 అంతర్జాతీయ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ బిజినెస్ కన్వెన్షన్ ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రపంచ ఏరోస్పేస్ రంగం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నదని.. పెట్టుబడులు, పరిశ్రమలు, అత్యాధునిక సాంకేతికతకు తెలంగాణే కొత్త చిరునామా అని స్పష్టం చేశారు. సూపర్‌సోనిక్ యుద్ధ విమానాలను నడిపిన వ్యక్తిగా ఏరోస్పేస్ రంగంలో నాణ్యత, ఖచ్చితత్వం ఎంత కీలకమో తనకు ప్రత్యక్ష అనుభవం ఉన్నదన్నారు. చిన్న విడిభాగం లోపం సైతం మిషన్ మొత్తాన్ని ప్రభావితం చేస్తుందని.. అలాంటి అత్యున్నత ప్రమాణాలను తెలంగాణ పరిశ్రమలు నేడు విజయవంతంగా అందిస్తున్నాయని చెప్పారు. అమెరికా అధ్యక్షుడి హెలికాప్టర్‌కు అవసరమైన క్యాబిన్లు, అపాచీ యుద్ధ హెలికాప్టర్ల నిర్మాణ భాగాలు, ఎఫ్–16 యుద్ధ విమానాల రెక్కలు, ప్రపంచ ప్రఖ్యాత ఏరో ఇంజిన్ విడిభాగాలు, ఎంఆర్ఓ వ్యవస్థలు తెలంగాణలోనే తయారవుతున్నాయని తెలిపారు.
మేడ్ ఇన్ తెలంగాణ అనే ముద్ర ఇప్పుడు ప్రపంచ ఆకాశంలో గర్వంగా ఎగురుతున్నదని పేర్కొన్నారు. స్పెయిన్‌కు చెందిన ఐటీపీ ఎయిరో, కెనడాకు చెందిన ఎఫ్‌టీజీ ఏరోస్పేస్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం రాష్ట్ర పారిశ్రామిక విశ్వసనీయతకు నిదర్శనమన్నారు. ఫ్రాన్స్, ఇటలీ సహా 25కిపైగా దేశాల కంపెనీలు ఏరోమార్ట్‌లో పాల్గొనడం తెలంగాణ అంతర్జాతీయ ప్రాధాన్యతను మరింత పెంచిందని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటికే 1,500లకు పైగా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు సేవలందిస్తున్న ఎంఎస్‌ఎంఈలు పనిచేస్తున్నాయని.. పరిశ్రమలకు అవసరమైన అత్యాధునిక పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండలాలు, ప్లగ్-అండ్-ప్లే మౌలిక సదుపాయాలు రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ఆకర్షణీయ పెట్టుబడి గమ్యస్థానంగా మార్చాయని చెప్పారు. డీఆర్‌డీఓ, రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు, పరిశోధనా కేంద్రాలు, ప్రైవేట్ పరిశ్రమలు ఒకే నగరంలో ఉండటం హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయి పోటీ సామర్థ్యాన్ని కల్పించిందన్నారు.
తెలంగాణ ఏరోస్పేస్, డిఫెన్స్ రంగం కొన్నేళ్లుగా దాదాపు 30 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేయగా.. గతేడాది ఎగుమతులు 103 శాతం పెరిగి, రాష్ట్రానికి ఎన్నో దశాబ్దాలుగా అగ్రగామిగా ఉన్న ఔషధ రంగాన్నే అధిగమించడం పారిశ్రామిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని పేర్కొన్నారు. అలాగే.. వరంగల్ విమానాశ్రయానికి వచ్చే నెలలో శంకుస్థాపన, ఆదిలాబాద్‌లో పౌర-సైనిక అవసరాలకు అనువైన ఎయిర్‌ఫీల్డ్, కొత్తగూడెం విమానాశ్రయానికి త్వరలో కేంద్ర ఆమోదం లభించనున్నాయని తెలిపారు. ఈ మూడు కేంద్రాలు భవిష్యత్తులో విమాన మరమ్మతు, విమాన తయారీ, రక్షణ పరిశ్రమలకు భారీ అవకాశాలను తెరవనున్నాయని చెప్పారు. ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 కేవలం ఒక పారిశ్రామిక సదస్సు కాదని.. ప్రపంచ ఏరోస్పేస్ పటంలో తెలంగాణ శాశ్వత స్థానాన్ని ఖరారు చేసే చారిత్రక వేదిక అని స్పష్టం చేశారు.






