- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థినుల భద్రతే షీ టీం లక్ష్యం : డీసీపీ ఏ. భాస్కర్
విద్యార్థినులు, మహిళల భద్రతే షీ టీం లక్ష్యమని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ అన్నారు.

దిశ, మంచిర్యాల: విద్యార్థినులు, మహిళల భద్రతే షీ టీం లక్ష్యమని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో డీసీపీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థినులు, మహిళల భద్రత, ఆత్మవిశ్వాసం, గౌరవాన్ని పరిరక్షించడమే షీ టీం ప్రధాన లక్ష్యమన్నారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలంటే భయపడాల్సిన అవసరం లేదన్నారు. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేస్తే భవిష్యత్తు దెబ్బతింటుందనే అపోహలను విడనాడాలన్నారు.
మహిళలు, విద్యార్థినులు తమకు ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా షీ టీం దృష్టికి తీసుకురావాలన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సామాజిక మాధ్యమాలు, ఫోన్ కాల్స్, సందేశాలు లేదా ప్రత్యక్షంగా ఎలాంటి వేధింపులు ఎదురైనా వాటిని సహించకుండా షీ టీంను సంప్రదించాలన్నారు. "పోనీలే" అనే భావనతో వేధింపులను వదిలేస్తే అవి మరింత పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మౌనాన్ని వీడాలని విద్యార్థినులకు సూచించారు.
విద్యాసంస్థలు, వసతి గృహాలు, నివాస ప్రాంతాలు, ఉద్యోగ ప్రదేశాలు, ప్రయాణ సమయాల్లో ఇబ్బందులు ఎదురైతే షీ టీం సహాయం కోరాలన్నారు. అవగాహన కార్యక్రమానికి హాజరైన విద్యార్థినులు, మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సత్ప్రవర్తనతో, క్రమశిక్షణతో చదువును కొనసాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాశ్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, జిల్లా షీ టీం ఇన్‌చార్జి ఎస్‌ఐ ఉషారాణి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అనూష, అధ్యాపకులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.






