- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బార్ లైసెన్స్‌తో… వైన్స్ దందా
ఎక్సైజ్ శాఖ నిబంధనలను ఉల్లంఘించడానికే అన్నట్లుగా వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

దిశ, కాగజ్‌నగర్ : ఎక్సైజ్ శాఖ నిబంధనలను ఉల్లంఘించడానికే అన్నట్లుగా వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొమరం భీమ్ జిల్లాలోని కాగజ్‌నగర్ పట్టణంలో అధికారుల కనుసన్నల్లోనే మద్యం అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక బస్టాండ్ సమీపంలోని ఓ బార్ యాజమాన్యం చట్టాన్ని తమ జేబులో పెట్టుకున్నట్లుగా వ్యవహరిస్తూ యథేచ్ఛగా అక్రమ వ్యాపారానికి తెరలేపిందని ఆరోపణలు ఉన్నాయి.
బార్ నిర్వహణకు ఉన్న ఒక్క లైసెన్స్‌తోనే, పక్కనే ఉన్న మరో భవనంలో ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా అక్రమంగా కొత్త వైన్స్ కౌంటర్‌ను ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ అక్రమ వ్యాపారం ఏదో దొంగచాటుగా సాగుతోందనుకుంటే పొరపాటే. ఏకంగా "ఎంఆర్‌పీ ధరలకే మద్యం లభించును" అంటూ పట్టణ ప్రధాన రహదారిపై, నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ప్రాంతంలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బహిరంగంగానే వ్యాపారం నిర్వహిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా, చట్టాన్ని బహిరంగంగా సవాల్ చేస్తూ ఇంతటి బరితెగింపుకు పాల్పడుతున్నా స్థానిక ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. నిత్యం అటుగా వెళ్లే అధికారుల కంటికి ఆ భారీ ఫ్లెక్సీలు కనిపించకపోవడం వెనుక నెలవారీ మామూళ్లే కారణమని స్థానికులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు.
దిశ ప్రశ్నించగానే.. షట్టర్లు పడ్డాయి
ఈ అక్రమ మద్యం విక్రయాల వ్యవహారం పై స్థానిక ఎక్సైజ్ సీఐ రవికుమార్ను దిశ ప్రతినిధి చరవాణి ద్వారా వివరణ కోరగా, "బార్‌కు సంబంధించిన మద్యాన్ని విడిగా బయట కౌంటర్లు ఏర్పాటు చేసి విక్రయించడం పూర్తిగా చట్టవిరుద్ధం. బార్ పక్కన ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఈ విషయం ఇప్పటివరకు మా దృష్టికి రాలేదు. దీనిపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం" అని స్పష్టం చేశారు.
అయితే, ఎక్సైజ్ సీఐకి దిశ ప్రతినిధి ఫోన్ చేసి వివరణ కోరిన కొద్దిసేపటికే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అధికారుల నుంచి అంతర్గతంగా హెచ్చరికలు వెళ్లాయో ఏమో గానీ, నిమిషాల వ్యవధిలోనే బార్ యాజమాన్యం అక్రమంగా నిర్వహిస్తున్న వైన్స్ కౌంటర్ షట్టర్లను గబగబా మూసివేసింది. ఇంతకాలం అధికారుల దృష్టికి రాని ఆ అక్రమ కౌంటర్, దిశ ప్రశ్నించగానే మూసివేయడం వెనుక ఉన్న లోపాయికారీ ఒప్పందం ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ఉన్నతాధికారులైనా కళ్లుతెరుస్తారా ?
కేవలం మీడియాకు సమాచారం చేరిందనే కారణంతో తాత్కాలికంగా షట్టర్లు వేయించడమేనా ? లేక అక్రమంగా నిర్వహిస్తున్న ఈ కౌంటర్ పై శాశ్వత చర్యలు తీసుకుంటారా? అని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి, కొమ్ముకాస్తూ నిద్రమత్తులో ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న క్షేత్రస్థాయి అధికారులపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కాగజ్‌నగర్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






