' నష్టపరిహారం అందించడంలో పూర్తి వైఫల్యం ప్రభుత్వానిదే '

by Batti.Sumithra |

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిగాచి దుర్ఘటన జరిగి ఏడాది గడిచినా మృతుల కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం అందించడంలో పరిశ్రమ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.

 నష్టపరిహారం అందించడంలో పూర్తి వైఫల్యం ప్రభుత్వానిదే
X

దిశ, పటాన్‌చెరు టౌన్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిగాచి దుర్ఘటన జరిగి ఏడాది గడిచినా, నేటి వరకు మృతుల కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం అందించడంలో పరిశ్రమ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యాయని, పరిశ్రమ యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం బంటుగా మారిందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా దుర్ఘటన స్థలం సాక్షిగా మృతి చెందిన ప్రతి కార్మికుడి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం అందిస్తామని ప్రకటించినా, నేటి వరకు ఆ హామీ అమలు కాకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలతో పాటు బాధితులకు సంపూర్ణ న్యాయం చేయకపోతే భారత రాష్ట్ర సమితి తరఫున ప్రజాక్షేత్రంలో నిరంతర పోరాటాలు చేస్తూనే ఉంటామని హెచ్చరించారు.

సిగాచి దుర్ఘటన జరిగి నేటితో ఏడాది పూర్తైన సందర్భంగా మంగళవారం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పాశమైలారం బీపీఎల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గూడెం మహిపాల్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదర్శ్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ.. గత సంవత్సరం జూన్ 30న సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో 54 మంది మృతి చెందగా, మరో ఎనిమిది మంది ఆచూకీ తెలియకపోవడంతో పాటు 40 మంది తీవ్రంగా గాయపడి నేటికీ నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులు, భర్తను కోల్పోయిన భార్య, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల బాధలు వర్ణనాతీతమని అన్నారు.

పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగా జరిగిన ఈ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అత్యంత దారుణంగా తయారైందని దుయ్యబట్టారు. ఘటన జరిగిన ఆరు నెలల అనంతరం ఒకరిని మాత్రమే అరెస్టు చేసి యాజమాన్యానికి ప్రభుత్వం బంటుగా మారిందని విమర్శించారు. ప్రమాద స్థలం సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మృతి చెందిన ప్రతి కార్మికుడి కుటుంబానికి కోటి రూపాయలు ఇస్తామని మీడియా ముఖంగా ప్రకటించి, నేటికి ఏడాది గడిచినా అమలు కాకపోవడం ప్రభుత్వ వైఖరికి అద్దం పడుతోందని విమర్శించారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితుల కుటుంబాలు ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమ యాజమాన్యం చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా కనికరం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల కోసం పోరాడుతున్న వారిని విమర్శించడం తప్ప బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

మంత్రి వివేక్ వెంకటస్వామి రూ.60 లక్షల పరిహారం అందించామని చెబుతున్నది అసత్యమని, సెబీలో రూ.118 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉందని వెల్లడించారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి కారణంగానే ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం ఇచ్చిందని, బాధిత కుటుంబాల పట్ల ప్రభుత్వానికి కనికరం లేదని మండిపడ్డారు.

సభకు అనుమతి ఇవ్వకపోవడం ప్రజాస్వామ్య విరుద్ధం.. నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదర్శ్ రెడ్డి

మాజీ మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో సిగాచి బాధితులతో కలిసి నిర్వహించాల్సిన సంస్మరణ సభకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని, ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి ఆదర్శ్ రెడ్డి అన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ వారి పక్షాన నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ మంత్రులు ఎక్కడున్నారు.. మాజీ జడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్

సిగాచి పరిశ్రమ దుర్ఘటన జరిగి ఏడాది గడుస్తున్నా బాధితులకు కోటి రూపాయల నష్టపరిహారం ఇప్పించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు ఏమయ్యారని మాజీ జడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే ఒంటి కాళ్ల మీద లేచే మంత్రులు దామోదర్ రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ఈ విషయంపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఒక బాధ్యత కలిగిన మంత్రి పదవుల్లో ఉండి, టీజీఐఐసీ చైర్‌పర్సన్‌గా ఉండి బాధితులకు న్యాయం చేయలేకపోయారని విమర్శించారు. ఘటన జరిగి ఏడాది గడిచినా బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇప్పించే బాధ్యత మీకు లేదా అని ఘాటుగా విమర్శించారు.

సిగాచి ప్రమాదం జరిగిన రోజు నుంచి నేటి వరకు బాధితుల పక్షాన నిలబడి పోరాడింది బీఆర్ఎస్ పార్టీ, మాజీ మంత్రి హరీశ్ రావు ఒక్కరేనని అన్నారు. బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇప్పించేందుకు అనేక సందర్భాల్లో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం, యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చారని తెలిపారు. ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేస్తే ఎక్కడ తమ బండారం బయటపడుతుందోనని భయపడ్డ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా అడ్డుపడిందన్నారు. మరో దారుణమైన విషయం ఏమిటంటే, కీలక బాధ్యుడైన పరిశ్రమ ఎండీ అమిత్‌రాజ్ సిన్హా దేశం విడిచి వెళ్లే ప్రయత్నం చేస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు.

ఇక్కడ ఇంత ఘోర ఘటన జరిగి, ఇన్ని కుటుంబాలు చిన్నాభిన్నమైతే పరిశ్రమ యాజమాన్యం పక్కనే షెడ్‌ను లీజుకు తీసుకుని కొత్తగా ఉత్పత్తి ప్రారంభిస్తే పోలీసు వ్యవస్థ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీస్, లేబర్ డిపార్ట్‌మెంట్‌లు నిద్రపోతున్నాయని విమర్శించారు. ఈ విషయమై జిల్లా అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే ఎలాంటి ఉత్పత్తి జరగడం లేదని చెప్పడం విచారకరమన్నారు. ఇక్కడితో ఈ ఉద్యమం ఆగదని, బాధితులకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్, మ్యారేజ్ ఖాన్, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, బాధిత కుటుంబ సభ్యులు, కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story