సిగాచీ ప్రమాదం.. పారిశ్రామిక చరిత్రలో చీకటి రోజు : హరీశ్‌రావు

by Muthe.Rajitha |

తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో జూన్ 30, 2025 చీకటి రోజు అని మాజీమంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు.

సిగాచీ ప్రమాదం.. పారిశ్రామిక చరిత్రలో చీకటి రోజు : హరీశ్‌రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో జూన్ 30, 2025 చీకటి రోజు అని మాజీమంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ‘ఎక్స్’లో విమర్శించారు. కూలి కోసం వలస వచ్చి సిగాచీ పరిశ్రమలో పనిచేస్తున్న 54 మంది పేద కార్మికులు సజీవదహనమైన దుర్దినమని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ వైఫల్యం.. సిగాచీ కంపెనీ నిర్లక్ష్యం కారణంగా అమాయక కార్మికులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ హృదయవిదారక ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడిందని.. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి మనసు మాత్రం కరగలేదని విమర్శించారు. దుర్ఘటన జరిగిన రోజు హైదరాబాద్‌లోని తన జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లోనే ఉన్నారని.. 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిగాచీ పరిశ్రమ వద్దకు మాత్రం రాలేదని ఆరోపించారు. విమర్శల నేపథ్యంలో తెల్లారి ఘటన వద్దకు వచ్చిన రేవంత్‌రెడ్డి మృతదేహాల సాక్షిగా ప్రతి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇస్తామని ఘనంగా ప్రకటించారని తెలిపారు. కానీ, ప్రభుత్వం తరఫున ఇచ్చింది లక్ష రూపాయలేనని.. ఇంతకంటే సిగ్గుమాలిన చర్యల ఏమైనా ఉంటదా? తలదించుకోవాలని పేర్కొన్నారు. కంపెనీ ఇచ్చిన డబ్బులు బాధిత కుటుంబాలకు ముట్టజెప్పి, కోటి పరిహారం నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కార్మికులు చనిపోవడం వల్ల చట్టబద్ధంగా వారికి రావాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ, లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులను కూడా కలుపుకుని పరిహారంలో చూపడం శోచనీయమని తెలిపారు. అది కార్మికుల కష్టార్జితం నుంచి హక్కుగా వచ్చిన డబ్బు అని తెలిపారు. క్షతగాత్రులకు సరైన వైద్య సహాయం అందక, జీతాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారని.. బాధిత కుటుంబాలకు ఇస్తానన్న ఉద్యోగాలు ఇప్పటికీ దిక్కులేదని పేర్కొన్నారు.

కార్మిక శాఖ బాధ్యత రాహిత్యానికి అమాయక వలస బతుకులు ఆవేదన చెందుతున్నాయని తెలిపారు. ప్రమాదంలో కాలి బూడిదై ఆచూకీ దొరకని 8 మంది కార్మికుల కుటుంబాలను డెత్ సర్టిఫికెట్ల కోసం నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పించుకున్న దుర్మార్గ ప్రభుత్వం ఇది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక ప్రమాదం కాదని.. యాజమాన్యం నిర్లక్ష్యంతో జరిగిన సామూహిక హత్య అని ఆరోపించారు. తూతూ మంత్రంగా ఎండీని అరెస్టు చేయడం, వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చేలా పరోక్షంగా సహకరించడం చూస్తుంటే.. ప్రభుత్వానికి, కంపెనీ యాజమాన్యానికి మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాలు ఏమిటో అర్థం అవుతూనే ఉన్నదని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వందల కోట్ల టర్నోవర్ ఉన్న సిగాచీ కంపెనీ డైరెక్టర్ల ఆస్తులను రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద అటాచ్ చేయాలని డిమాండ్ చేశారు. వాటిని అమ్మి అయినా బాధిత కుటుంబాలకు బేషరతుగా కోటి రూపాయల పరిహారాన్ని చెల్లించాలని పేర్కొన్నారు. మృతదేహాల సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని.. లేకపోతే బాధిత కుటుంబాల కన్నీళ్లు ప్రభుత్వాన్ని తప్పకుండా వెంటాడుతాయని హెచ్చరించారు.

వేదాలు వల్లించే పండితులనూ వేధించడమేనా..?

రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో వేదాలు వల్లించే వేద పండితులను సైతం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వేధించడం బాధాకరమని హరీశ్‌రావు అన్నారు. యాదాద్రి, బాసర, భద్రాచలం తదితర ప్రముఖ దేవాలయాల్లో జరుగుతున్న వేద పండితుల నియామకాల్లో స్థానికులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ తెలంగాణ వేద పండితుల ప్రతినిధులు హరీశ్‌రావు‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని దేవాలయాల్లో స్థానిక వేద పండితులకు దక్కాల్సిన అవకాశాలు ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి వెళ్తున్నాయన్న ఆరోపణలు అత్యంత ఆందోళనకరమన్నారు. తెలంగాణ యువత, స్థానిక వేద పండితుల హక్కులను పరిరక్షించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. తెలంగాణ దేవాలయాల్లో భర్తీ చేసే వేద పండితుల పోస్టుల్లో స్థానికులకు ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

Next Story