ఎం-ఎం-ఎం సూత్రాన్ని పాటించండి : సీపీ సజ్జనార్

by Batti.Sumithra |

ఎం (మానిటర్–పర్యవేక్షణ), ఎం (మెంటర్–మార్గదర్శకులుగా), ఎం (మోటివేట్–ప్రోత్సహించడం) ఈ మూడు ‘ఎం’ల సూత్రాన్ని ఇప్పుడు ప్రతి ఇంట్లోని తల్లిదండ్రులు పాటించాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు.

ఎం-ఎం-ఎం సూత్రాన్ని పాటించండి : సీపీ సజ్జనార్
X

దిశ, సిటీ క్రైమ్ : ఎం (మానిటర్–పర్యవేక్షణ), ఎం (మెంటర్–మార్గదర్శకులుగా), ఎం (మోటివేట్–ప్రోత్సహించడం) ఈ మూడు ‘ఎం’ల సూత్రాన్ని ఇప్పుడు ప్రతి ఇంట్లోని తల్లిదండ్రులు పాటించాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. పిల్లల ఆన్‌లైన్ గేమింగ్‌లపై నిఘా పెట్టడం, వారితో అధిక సమయం గడిపి మార్గదర్శకులుగా ఉండడం, వారిలో ఉన్న టాలెంట్, క్రీడలు, చదువుపై ఆసక్తిని ప్రోత్సహించడమే ట్రిపుల్ ఎం లక్ష్యమని సీపీ తెలిపారు. పిల్లలను ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ల మాయ నుంచి బయటపడేయాలంటే ఈ సూత్రాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిందేనన్నారు. నిర్లక్ష్యం చేస్తే పిల్లలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురై వారి భవిష్యత్తును ఛిద్రం చేసుకునే ప్రమాదం ఉందని సీపీ హెచ్చరించారు.

సాంకేతికతను బాధ్యతాయుతంగా ఉపయోగించుకునేలా పిల్లలను తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. పర్యవేక్షణ లేని ఇంటర్నెట్ వినియోగం కారణంగా ఆర్థికంగా, మానసికంగా దెబ్బతినకుండా, వేధింపుల బారిన పడకుండా పిల్లలను కాపాడుకోవడానికి ఈ త్రీ ఎం సూత్రం ఎంతో దోహదపడుతుందన్నారు. ‘క్లిక్ చేసే ముందు ఆలోచించండి’ అనే అలవాటును పిల్లల్లో పెంపొందించాలని సూచించారు. స్కూళ్లలో కూడా ఉపాధ్యాయులు ఆన్‌లైన్ గేమ్‌ల వల్ల జరిగే అనర్థాల గురించి విద్యార్థులకు వివరించాలని సీపీ కోరారు. చిన్నారులను ఆన్‌లైన్ గేమింగ్ ముప్పు నుంచి కాపాడేందుకు, ముందుగా వారు గేమ్‌లు ఆడే ఫోన్‌ల నుంచి సేవ్ చేసిన బ్యాంక్ కార్డులు, యూపీఐ ఆటోఫిల్ వివరాలను తొలగించాలని సూచించారు. ప్రతి లావాదేవీకి పిన్ లేదా బయోమెట్రిక్ లాక్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లలో పేరెంటల్ కంట్రోల్స్, పర్చేజ్ అప్రూవల్స్‌ను ఆన్ చేసుకోవాలని సూచించారు. పిల్లలకు మినిమమ్ బ్యాలెన్స్ ఉండే ప్రీపెయిడ్ కార్డులు మాత్రమే ఇవ్వాలని తెలిపారు.

పిల్లలతో స్నేహపూర్వకంగా ఉంటూ వారు ఆడే ఆటల గురించి తెలుసుకోవాలని సూచించారు. ఫోన్ తీసుకున్నప్పుడు పిల్లల్లో విపరీతమైన కోపం, నిద్రలేమి, దొంగచాటుగా ఫోన్ చూడడం లేదా ఇతర విచిత్రమైన మార్పులు కనిపిస్తే వెంటనే చైల్డ్ సైకాలజిస్ట్ లేదా కౌన్సిలర్ సహాయం తీసుకోవాలని సీపీ సూచించారు. 10 నుంచి 17 సంవత్సరాల వయస్సు గల వారు చదువుకంటే గేమింగ్ యాప్‌లలోనే అధిక సమయం గడుపుతున్నారని ఇటీవల చోటుచేసుకున్న కొన్ని సంఘటనలతో రుజువైందని సీపీ పేర్కొన్నారు. కొన్ని కేసుల్లో తమ బ్యాంక్ ఖాతా హ్యాక్ అయిందంటూ తమ వద్దకు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వాటిని దర్యాప్తు చేసినప్పుడు, పిల్లలు గేమింగ్ మోజులో పడి ఫోన్‌కు లింక్ అయిన యూపీఐ, బ్యాంక్ ఖాతాలను వినియోగించినట్లు తేలిందన్నారు.

ఇంట్లోని తాతయ్య, నానమ్మ, అమ్మమ్మల ఫోన్‌లలో ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతుండడంతో పిల్లలు కూడా ఆ మోజుకు బానిసలై, గుట్టుచప్పుడు కాకుండా వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు గుర్తించామని సీపీ వివరించారు. కాబట్టి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పిల్లల ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనాన్ని అరికట్టేందుకు ఈ ట్రిపుల్ ఎం సూత్రాన్ని అలవాటు చేసుకోవాలని, తద్వారా ఆర్థిక నష్టాలను నివారించడంతో పాటు పిల్లలను ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనానికి దూరంగా ఉంచవచ్చని సీపీ సూచించారు.

Next Story