రైల్వే స్టేషన్ల అప్రోచ్ రోడ్లపై నిర్లక్ష్యం వద్దు.. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

by Malleboina Mahesh |

సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్ల అప్రోచ్ రోడ్ల విస్తరణపై ముఖ్యమంత్రికి లేఖ! భూసేకరణ మరియు నిధుల విడుదలపై వ్యక్తిగత చొరవ చూపాలని వినతి.

రైల్వే స్టేషన్ల అప్రోచ్ రోడ్లపై నిర్లక్ష్యం వద్దు.. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ఉన్న సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు కేంద్ర చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను భారీ ఎత్తున నిర్మించింది. నగరంలోని రద్దీని తగ్గించేందుకు అత్యంత కీలకమైన ఈ చర్లపల్లి రైల్వే టెర్మినల్, పునరాభివృద్ధి చెందుతున్న సికింద్రాబాద్ స్టేషన్ల వద్ద అప్రోచ్ రోడ్ల (approach roads,) విస్తరణ, భూసేకరణ పనులను తక్షణమే చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy)కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) లేఖ రాశారు.

ముఖ్యంగా చర్లపల్లి స్టేషన్ అవసరాల దృష్ట్యా ఎఫ్.సి.ఐ గోడౌన్ (FCI Godown) రోడ్డును 200 అడుగులకు, భరత్ నగర్, ఈసీ నగర్ వైపు ఉన్న రహదారులను 100 అడుగులకు విస్తరించడంతో పాటు, పార్కింగ్ కోసం సుమారు 5.70 ఎకరాల భూమిని కేటాయించాల్సిన అవసరం ఉందని. అలాగే రైల్వే శాఖ ఇప్పటికే నిధులు జమ చేసినందున స్టేషన్‌కు నీటి సరఫరా కనెక్షన్‌ను త్వరగా పూర్తి చేయాలని కిషన్ రెడ్డి తన లేఖలో కోరారు. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉత్తర టెర్మినల్ వద్ద ప్రయాణికుల రాకపోకలకు వీలుగా ఆల్ఫా హోటల్ నుంచి రథీఫైల్ బస్టాండ్ వరకు ఉన్న రహదారిని 120 అడుగులకు విస్తరించాలని కోరారు.

గత కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్యలపై పలుమార్లు లేఖల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి గతంలోనే అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కావున నగర రవాణా వ్యవస్థకు ఎంతో కీలకమైన ఈ మౌలిక సదుపాయాల కల్పనపై ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా చొరవ చూపి, భూసేకరణ, రోడ్ల విస్తరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

Next Story