పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

by Muthe.Rajitha |

ప్రకృతిని కాపాడటం, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించడం మనందరి కర్తవ్యమని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు.

పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రకృతిని కాపాడటం, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించడం మనందరి కర్తవ్యమని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. ప్రదాని మోడీ ఏక్​పేడ్​మా కే నామ్​పిలుపు స్పూర్తితో శుక్రవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మొక్క నాటారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఈకార్యక్రమం కేవలం మొక్కలు నాటే కార్యక్రమం మాత్రమే కాదని, అది తల్లిపట్ల గౌరవాన్ని వ్యక్తపరుస్తూనే ప్రకృతిని కాపాడుకోడం పట్ల సమాజంలో అవగాహన పెంపొందించే ఒక మహత్తర ప్రజా ఉద్యమమని తెలిపారు. ప్రకృతి పరిరక్షణ, వాతావరణ మార్పుల దుష్ప్రభావాల నివారణ, జీవవైవిధ్య సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలని మోడీ పిలుపుకు అందరు స్పందించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సుస్థిరాభివృద్ధి, హరిత అభివృద్ధి లక్ష్యాలతో దేశం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. దేశ ప్రజలందరూ ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగస్వాములై, హరిత భారత నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు.

భారత ఆర్థిక వ్యవస్థపై రాహుల్ గాంధీ చేసేవి నిరాధారణమైన ఆరోపణలు

ప్రభుత్వం అన్ని షాక్ అబ్జార్బర్‌లను తొలగించడం వల్ల భారతదేశం ఆర్థిక సునామీ వైపు వెళుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తన స్వార్థ రాజకీయాల కోసం చేసిన అసత్యపు వాదన నిరాధారమైనదని మండిపడ్డారు. ఈ ఆరోపణలు దేశ ప్రజలలో లేని భయాందోళనలను రెచ్చగొట్టడమే. ఒకవేళ భారతదేశపు ఆర్థిక వ్యవస్థ షాక్ అబ్జార్బర్‌లను నిజంగానే తొలగించి ఉంటే, ముడి చమురు ధరలు, పశ్చిమ ఆసియాలో సంఘర్షణ, దిగుమతులు, ఎగుమతులపై సప్లై చైన్ లో అంతరాయాలు ఎదుర్కొంటున్నప్పటికీ, నిరంతర భౌగోళిక రాజకీయ అనిశ్చితి ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ ఎందుకు నిలకడగా కొనసాగుతోందన్నారు. ప్రభుత్వం ఏ రకమైన షాక్ అబ్జార్బర్‌లను తొలగించలేదు. 140 కోట్ల భారత ప్రజల సహకారంతో గత దశాబ్ద కాలంలో మోడీ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం హయాంలో 2011 నుండి 2013 మధ్య, రూపాయి విలువ 36 శాతం పడిపోయింది. విదేశీ మారక నిల్వలు జూలై 2011లో సుమారు 294 బిలియన్ డాలర్ల నుండి ఆగస్టు 2013 నాటికి దాదాపు 256 బిలియన్ డాలర్లకు తగ్గాయి. దిగుమతుల కవరేజ్ మార్చి 2004 నుండి సెప్టెంబర్ 2013 నాటికి ప్రమాదస్థాయికి పడిపోయిందన్నారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన అసలైన షాక్ అబ్జార్బర్ల తొలగింపు.

రాహుల్ గాంధీ తెలుసుకోవలసిన నిజాలు ఎన్నో ఉన్నాయన్నారు. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ, బాధ్యతారహితంగా ప్రపంచంలో భారత ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రవర్తించడం దేశ ప్రజలలో లేని భయాందోళనలు సృష్టించడం ఆపాలని సూచించారు. మోడీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా చాలా స్పష్టంగా ఉంది. కాంగ్రెస్ విపరీతమైన అవినీతి కుంభకోణాలతో దేశంలో బలహీనతలను సృష్టిస్తే మోడీ ప్రభుత్వం పునరుద్ధరణ శక్తిని సృష్టిస్తోంది. కొన్ని రోజులుగా ప్రతి కొన్ని నెలలకొకసారి, ఏదో ఒక అబద్దపు, ఊహాజనిత, దేశ వ్యతిరేక, ప్రజా వ్యతిరేకతతో కూడిన తుస్సుమనే డ్రామా బాంబులతో రాహుల్ గాంధీ ఒక కొత్త కుట్ర సిద్ధాంతాన్ని సృష్టిస్తారు. ఆర్థిక సునామీ పొంచి ఉందని వితండ వాదనతో ప్రజలను రెచ్చగొట్టాలని, కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని కూల్చి, ఆ కుర్చీలో తాను అమాంతం కూర్చోవాలని, ప్రధానమంత్రి పదవి తన కుటుంబ హక్కు అని, ఈ దేశంలో నేనే రాజుననే భ్రమలతో కాలం గడుపుతున్నాడని ఎద్దేవా చేశారు.

Next Story