- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పట్టణ ప్రణాళికలో పర్యావరణానికి పెద్దపీట : జలమండలి ఎండీ అశోక్ రెడ్డి
పట్టణ ప్రణాళిక, పరిపాలనలో పర్యావరణానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : పట్టణ ప్రణాళిక, పరిపాలనలో పర్యావరణానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అన్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా (ఐటీపీఐ) తెలంగాణ రీజినల్ చాప్టర్ ఆధ్వర్యంలో బేగంపేటలోని కార్యాలయంలో ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ ఏడాది ‘ప్రకృతి స్ఫూర్తితో.. వాతావరణం కోసం.. మన భవిష్యత్తు కోసం’ అనే ప్రత్యేక ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తు తరాల కోసం సహజ వనరులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. చెరువులు, జలాశయాలను పునరుద్ధరించడం అత్యంత అవసరమన్నారు. నగరాల్లో పచ్చదనాన్ని పెంచడం, భూగర్భ జలాల రీఛార్జ్, స్థిరమైన నీటి నిర్వహణ పద్ధతులను అవలంబించడం ద్వారా నీటి కొరత, వాతావరణ మార్పుల సవాళ్లను అధిగమించవచ్చని స్పష్టం చేశారు. ఐటీపీఐ తెలంగాణ చాప్టర్ చైర్మన్, డీటీసీపీ డైరెక్టర్ ఎస్. దేవేందర్ రెడ్డి స్వాగతోపన్యాసం చేస్తూ.. వేగంగా విస్తరిస్తున్న పట్టణాలను పర్యావరణ అనుకూలంగా, వాతావరణ మార్పులను తట్టుకునేలా తీర్చిదిద్దడంలో పట్టణ ప్రణాళికాధికారుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.
హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ వీఎస్ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో పచ్చదనాన్ని పెంచడానికి చేపట్టిన సాంకేతిక ఆవిష్కరణలను వివరించారు. ఈ కృషి వల్లే హైదరాబాద్‌కు అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మక ‘ట్రీ సిటీస్ ఆఫ్ ది వరల్డ్’ గుర్తింపు లభించిందని గుర్తుచేశారు. టీజీఐసీ ఎండీ సోహెల్ ఖాన్ ప్రకృతి నుంచి స్ఫూర్తి పొంది దేశవ్యాప్తంగా యువ ఆవిష్కర్తలు రూపొందించిన వినూత్న పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానాలను పరిచయం చేశారు.జేఎన్టీయూ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రిమా రాయ్ మాట్లాడుతూ మురుగునీటి శుద్ధి, పునర్వినియోగంలో వాడుతున్న ఆధునిక సాంకేతిక విధానాలను వివరించి, నీటి పొదుపు ప్రాధాన్యతను చాటిచెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటీపీఐ తెలంగాణ రీజినల్ చాప్టర్ వైస్ చైర్మన్ వెంకన్న, సెక్రటరీ మురళీధర్ రెడ్డి, ట్రెజరర్ పి. శ్రీసుధ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.






