వ‌ర్షాకాల స‌న్న‌ద్ధ‌త‌పై హైడ్రా స‌మావేశం

by Muthe.Rajitha |

వ‌ర్షాకాలంలో న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని శాఖ‌ల‌కు చెందిన అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ సూచించారు.

వ‌ర్షాకాల స‌న్న‌ద్ధ‌త‌పై హైడ్రా స‌మావేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో : వ‌ర్షాకాలంలో న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని శాఖ‌ల‌కు చెందిన అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ సూచించారు. వ‌ర్షాకాలం నీట మున‌క‌కు సంబంధించి ఎక్క‌డ ఏ స‌మ‌స్య త‌లెత్తినా హైడ్రా దృష్టికి తీసుకువ‌స్తే ప‌రిష్క‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. జీహెచ్ఎంసీ, సీఎంసీ ప‌రిధిలోని అన్ని విభాగాల అధికారుల‌తో వ‌ర్షాకాల స‌న్న‌ద్ధ‌త‌పై ఇప్ప‌టికే స‌మీక్షించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌.. ఎంఎంసీ క‌మిష‌న‌ర్ విన‌య్ కృష్ణా రెడ్డితో క‌లిసి శుక్ర‌వారం మ‌ల్కాజిగిరి మున్సిప‌ల్ ప‌రిధిలో వ‌చ్చే ఇబ్బందుల‌పై చ‌ర్చించారు. ఎంఎంసీ ప‌రిధిలో 188 వాట‌ర్ లాగింగ్ పాయింట్లుంటే.. అందులో మేజ‌ర్ 69, మీడియం 39, మైన‌ర్ స‌మ‌స్య‌లున్న‌వి 80 వ‌ర‌కూ ఉన్నాయ‌న్నారు.

డీఆర్ఎఫ్ కు చెందిన 5 మందితో ఉన్న టీమ్‌లు 12, మాన్సూన్ ఎమ‌ర్జ‌న్సీ టీమ్‌లు 74 (ఒక్కో టీమ్‌లో న‌లుగురు), 175 మంది స్టాటిక్ సిబ్బంది నిత్యం క్షేత్ర‌స్థాయిలో ప‌ని చేస్తార‌ని అవ‌స‌ర‌మైతే పెంచుతామ‌న్నారు. వీళ్ల‌తో పాటు.. హైడ్రా ఎస్ ఎప్ వోలుంటారు. హైడ్రా, మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌, ట్రాఫిక్ పోలీసులు, జ‌ల‌మండ‌లి, ఇరిగేష‌న్‌, విద్యుత్ శాఖ, యూబీడీ శాఖలతో నిరంతర సమన్వయం కొనసాగిస్తూ సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విభాగాల‌కు చెందిన అధికారుల‌తో క‌మిష‌న‌రేట్ నుంచి డివిజ‌న్ వ‌ర‌కూ వివిధ స్థాయిల్లో క‌మిటీలు ఏర్పాటు చేసుకుని స‌మ‌న్వ‌యంగా ప‌ని చేయాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ సూచించారు. ప్రమాదాలకు కారణమయ్యే శిథిలావస్థలో ఉన్న భవనాలు, భారీ ప్రకటన బోర్డులను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలన్నారు.

9 చెరువుల‌కు ఫ్ల‌డ్ గేట్లు అమ‌ర్చాలి..

మ‌ల్కాజిగిరి మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో 9 చెరువుల‌కు ఫ్ల‌డ్ గేట్లు అమ‌ర్చాల్సిన‌వ‌స‌రం ఉంద‌ని క‌మిష‌న‌ర్ విన‌య్ కృష్ణారెడ్డి కోరారు. కార్పొరేష‌న్లో 14 స‌ర్కిళ్లున్నాయ‌ని.. 12 డీఆర్ ఎఫ్ బృందాల‌కు తోడు మ‌రో రెండు పెంచి 14 చేయాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్‌ను అడిగారు. మున్సిపాలిటీ ప‌రిధిలోని మొత్తం వ‌ర‌ద కాలువ‌ల‌న్నీ పూడిక తీసే ప‌నులు పూర్తి చేశామ‌ని చెప్పారు. వ‌ర్షాకాలంలో ఇబ్బందుల‌ను ప‌రిష్క‌రించ‌డానికి అన్ని విభాగాల‌తో క‌ల‌సి ప‌ని చేస్తామ‌న్నారు. నాలాల నెట్‌వర్క్ మ్యాపింగ్ పూర్తి చేయడం ద్వారా వర్షపు నీటి ప్రవాహాన్ని మరింత సమర్థవంతంగా నిర్వ‌హించ‌వ‌చ్చున‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ తెలిపారు. మ్యాన్‌హోళ్లు ఎక్క‌డున్నాయ‌నేది ఆ ద‌గ్గ‌ర్లోని గోడ‌ల‌పై మార్కింగ్ చేస్తే.. వ‌ర‌ద స‌మ‌యంలో ఇబ్బందులు ప‌రిష్క‌రించ‌వ‌చ్చ‌న్నారు.

హైడ్రా కంట్రోల్ రూమ్‌ను కేంద్ర బిందువుగా చేసుకుని వాతావరణ హెచ్చరికలు, అత్యవసర సమాచారాన్ని సంబంధిత శాఖలకు తక్షణం చేరవేసే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ముందస్తు ప్రణాళికతో స‌మ‌న్వ‌యంగా పనిచేస్తే వర్షాకాల సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవ‌చ్చున‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ తెలిపారు. అంత‌కు ముందు వాట‌ర్‌లాగింగ్ పాయింట్ల‌తో పాటు డీసిల్టింగ్ ప‌నుల‌ను, మెట్ టీమ్‌లు ఎలా ప‌ని చేస్తాయో హైడ్రా అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ వ‌ర్ల పాప‌య్య వివ‌రించారు. హైడ్రా అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ ఆర్.సుద‌ర్శ‌న్, ట్రాఫిక్ డీసీపీలు, ఎంఎంసీ జోన‌ల్ క‌మిష‌న‌ర్లు, ఇరిగేష‌న్‌, విద్యుత్ శాఖ‌, జ‌ల‌మండ‌లి, జాతీయ ర‌హ‌దారులు, యూబీడీ, కంటోన్మెంట్ అధికారులు ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు.

Next Story