సీఎం గారు మీకు మానవత్వం ఉందా అంటూ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై బండి సంజయ్ లేఖ

by Malleboina Mahesh |

తెలంగాణలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘాటైన బహిరంగ లేఖ రాశారు.

సీఎం గారు మీకు మానవత్వం ఉందా అంటూ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై బండి సంజయ్ లేఖ
X

దిశ, కరీంనగర్ బ్యూరో : తెలంగాణలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘాటైన బహిరంగ లేఖ రాశారు. ‘సీఎం గారు... మీకు మానవత్వం ఉందా? రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించకుండా వారిని మానసిక వేదనకు గురి చేయడం న్యాయమా?’ అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ పలు కీలక అంశాలను లేఖలో ప్రస్తావించారు.

నిర్లక్ష్యం నీడన లక్షలాది మంది ఉద్యోగులు

రాష్ట్రంలో 3 లక్షల మందికి పైగా రెగ్యులర్ ఉద్యోగులు, 4 లక్షల మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం 5 డీఏలను పెండింగ్‌లో ఉంచిందని బండి సంజయ్ విమర్శించారు. ఉద్యోగులు తమ భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్న గ్రాట్యుటీ, ఈపీఎఫ్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలను కూడా చెల్లించడం లేదని ఆరోపించారు. 2023 జూలై నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీ నివేదికను కూడా తెప్పించుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని మండిపడ్డారు.

61 మంది మరణాలకు బాధ్యత ఎవరిది?

జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసి రిటైర్ అయిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 నుంచి ఇప్పటి వరకు దాదాపు 13వేల మంది రిటైర్డ్ అవ్వగా, వారికి రావాల్సిన బెనిఫిట్స్ అందక పిల్లల పెళ్లిళ్లు, చదువుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ ఆర్థిక ఇబ్బందులు, మానసిక వేదన కారణంగా గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని, ఈ చావులకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మానవత్వం ఉన్న పాలకులు ఎవరూ ఇలాంటి నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించరని హితవు పలికారు.

రూ.12వేల కోట్ల బకాయిలపై పోరాటం తప్పదు!

ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన మొత్తం బకాయిలు రూ.12వేల కోట్లకు పైగా ఉన్నాయని, ఏటా రూ.2.5లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి ఇది పెద్ద భారం కాదని ఆయన గుర్తుచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడి, యుద్ధ ప్రాతిపదికన రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మున్సిపల్ ఎన్నికల అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని, అవసరమైతే హైదరాబాద్ నడిబొడ్డున ప్రభుత్వం దిగి వచ్చే వరకు దీక్షలు చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.

Next Story