యువకుడి దారుణ హత్య.. బండరాళ్లతో కొట్టి కారంతో

by Disha Web Desk 14 |
యువకుడి దారుణ హత్య.. బండరాళ్లతో కొట్టి కారంతో
X

దిశ, జడ్చర్ల : బండరాళ్లతో మోది వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన శుక్రవారం జడ్చర్ల మండలంలో చోటుచేసుకుంది. నిన్నటిదాకా అందరితో కలివిడిగా కలిసిన వ్యక్తి దారుణ హత్యకు గురికావడంతో ఆ గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం బూరుగుపల్లి గ్రామం దళితవాడకు చెందిన శ్రీశైలం(28) అనే యువకుడు బతుకుదెరువు కోసం కూలి పని చేసుకుంటూ తన కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. కాగా ఎప్పటిలాగే కూలికి వెళ్లి గురువారం రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు ఆందోళనకు గురయ్యారు. తెల్లవారేసరికి గ్రామ సమీపంలోని పంటపొలాల్లో శ్రీశైలం మృతి చెంది ఉండడంతో గ్రామస్తులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.


దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా బండరాళ్లతో మోది హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లు, బండ రాళ్లు, మృతదేహంపై కారం పొడి చల్లి దుండగులు అక్కడనుండి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. కాగా మృతి చెందిన వ్యక్తికి ఏమైనా పాత కక్షలు ఉన్నాయా.. లేక మరి ఎవరైనా కావాలనే హత్య చేశారా.. అన్న కోణాల్లో పట్టణ సీఐ రమేశ్ బాబు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


Next Story