జన సమితి పార్టీ చీఫ్ కోదండరాం ఎమ్మెల్సీ పదవిపై అనిశ్చితి

by Malleboina Mahesh |

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికార పీఠానికి చేర్చడంలో కలిసొచ్చిన తెలంగాణ జన సమితి కాసింత అలక చెందినట్లు కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం తీరుపైనా అసంతృప్తితో ఉన్నట్లు టీజేఎస్ వర్గాలు చెబుతున్నాయి.

జన సమితి పార్టీ చీఫ్ కోదండరాం ఎమ్మెల్సీ పదవిపై అనిశ్చితి
X

దిశ, తెలంగాణ బ్యూరో: గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికార పీఠానికి చేర్చడంలో కలిసొచ్చిన తెలంగాణ జన సమితి కాసింత అలక చెందినట్లు కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం తీరుపైనా అసంతృప్తితో ఉన్నట్లు టీజేఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి కీలక సమావేశంలో ప్రభుత్వ రెండేళ్ల పనితీరు, కాంగ్రెస్ వ్యవహార శైలిపై సమీక్షించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా పలువురు నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. ఇదే విధానం కొనసాగితే ప్రభుత్వం తీరుపై ప్రజలతో కలిసి ఉద్యమబాటను పట్టాల్సిందేనని పలువురు నేతలు అభిప్రాయ పడినట్లు తెలిసింది. ప్రధానంగా తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ పదవి పై కొనసాగుతున్న అనిశ్చితిపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు స్పష్టమైంది.

ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా!

కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో రెండు ఎమ్మెల్సీ పదవులు, నాలుగు నామినేటెడ్ పోస్టులు, లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రాధాన్యం వంటి అంశాలు ఉన్నాయని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. కాగా, కోదండరాంకు కేటాయించిన ఎమ్మెల్సీ పదవి వివాదంలో ఉండటం, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత న్యాయస్థానం తీర్పుతో ఆయన పదవి రద్దు కావడం ఆ పార్టీ వర్గాలు తీవ్ర నిరాశకు గురిచేసింది. మళ్లీ రాష్ట్ర మంత్రివర్గం కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ప్రతిపాదిస్తూ నిర్ణయం తీసుకున్నది. అయితే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అంశం న్యాయస్థానంలో ఉండటంతో పదవికి వారి పేర్లు ఖరారైనా ప్రమాణ స్వీకారంపై అనిశ్చితి కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా.. బీఆర్ఎస్ సర్కార్ కు వ్యతిరేకంగా ఉద్యమించిన కీలక నేతకు పదవి కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని జన సమితి నేతలు పెదవి విరుస్తున్నారు. ఎమ్మెల్సీ పదవి పై క్లారిటీ లేకపోతే ప్రభుత్వం కోదండరాంకు కీలకమైన పదవిని ఇచ్చి గౌరవించాలని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

మిత్ర ధర్మం ఎక్కడ?

ఇక నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ స్పష్టత లేదని, భర్తీ ఎప్పుడు జరుగుతుందో తెలియని స్థితి నెలకొన్నదని జనసేన నేతలు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచింది. ఇప్పటివరకు ఈ పోస్టుల్లో తమకు ఏమాత్రం ప్రాధాన్యం లభిస్తుందోనని టీజేఎస్ నేతలు పేర్కొంటున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లోనూ జడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్, మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇప్పటివరకు మిత్ర ధర్మంగా తమతో పొత్తుపై కీలక చర్చలు జరగలేదని, దీంతో పార్టీలో ఉన్న నేతలు అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. తమకు ప్రాధాన్యం ఇవ్వకపోతే రానున్న రోజుల్లో కాంగ్రెస్ కు మిత్రపక్షంగా కొనసాగలేమన్న అభిప్రాయం మెజార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. మిత్రపక్షంగా కాంగ్రెస్ వ్యవహరించే తీరుపై తమ పార్టీ విధానం ఉంటుందని, ఇదే నిర్లక్ష్యం, ఉదాసీనత కొనసాగితే రాజకీయ పార్టీగా తాము ఓ విధానం తీసుకొని ప్రజల్లోకి వెళ్లక తప్పదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ పరిణామాలపై అధికార కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Next Story