ఇదేంది.. 'నారాయణ'!

by Batti.Sumithra |

ఐఐటీ, జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటున్న ఓ కార్పొరేట్ విద్యాసంస్థ వ్యవహారం ప్రస్తుతం మణికొండ – పుప్పాలగూడ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

ఇదేంది.. నారాయణ!
X

దిశ, గండిపేట : ఐఐటీ, జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటున్న ఓ కార్పొరేట్ విద్యాసంస్థ వ్యవహారం ప్రస్తుతం మణికొండ – పుప్పాలగూడ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. నారాయణ ఐఐటీ, నీట్ అకాడమీ పేరుతో నిర్వహిస్తున్న ఈ కళాశాలకు సంబంధించి అవసరమైన అనుమతులు లేకుండానే కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యవహారం జరుగుతున్న రంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారులకు తెలియకపోవడం, వారు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థుల నుంచి ఒక్కొక్కరి వద్ద ఏడాదికి సుమారు రూ.2 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ సంబంధిత శాఖల అనుమతులు, గుర్తింపు ఏమాత్రం లేవు. కళాశాల యాజమాన్యం, సంబంధిత సిబ్బంది దర్జాగా విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు.

ప్రచారంతో బురిడీలు..

ఐఐటీ, జేఈఈ, నీట్ లో మెరుగైన ర్యాంకులు సాధించేలా ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామంటూ ప్రచారం నిర్వహిస్తూ అడ్మిషన్లు తీసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అత్యాధునిక విద్యా విధానాలు, ప్రత్యేక ఫ్యాకల్టీ, కార్పొరేట్ స్థాయి కోచింగ్ పేరుతో విద్యార్థులను ఆకర్షిస్తున్నట్లు చెబుతున్నారు.

కోట్లలో ఫీజులు వసూలు..

మణికొండ పుప్పాలగూడతో పాటు నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే తరహాలో నారాయణ అకాడమీ విద్యా సంస్థలు కొనసాగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. నిబంధనల ప్రకారం మణికొండలో ఉన్న నారాయణ అకాడమీ కేవలం కోచింగ్ మాత్రమే ఇవ్వాలి. కానీ కళాశాల యాజమాన్యం దర్జాగా ఇంటర్మీడియట్ కోర్సులు నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు నాలుగు ఐదు సంవత్సరాలుగా ఎలాంటి పర్మిషన్ లేకుండానే కళాశాల నడవడం గమనార్హం.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం కళాశాలల నిర్వహణకు బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ తో పాటు సంబంధిత శాఖల నుంచి అనుమతులు, గుర్తింపులు తప్పనిసరి. అయినప్పటికీ ఏమాత్రం పర్మిషన్లు లేకుండానే సంస్థలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వస్తుండటంతో అధికారుల పర్యవేక్షణ పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల ఆశలు, లక్షల రూపాయల ఫీజులు ముడిపడి ఉన్న నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు వెంటనే విచారణ చేపట్టి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న శ్రీ నారాయణ అకాడమీ పై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నారు.

త్వరలో అనుమతులు తీసుకుంటాం..

మణికొండ పుప్పాలగూడ ప్రాంతంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న నారాయణ అకాడమీకి అనుమతులు లేవు కదా అని ఏటీఎం బాలాజీని వివరణ కోరగా.. అనుమతులు లేవనే విషయం వాస్తవమైన అన్నారు. త్వరలో పర్మిషన్ తీసుకుంటామని ఆయన చెప్పడం గమనార్హం.

Next Story