పేదల వద్దకే క్యాన్సర్ వైద్య సేవలు : ఎంపీ మాధవనేని రఘునందన్ రావు

by Batti.Sumithra |

శిశిర హాస్పిటల్ వారి సహకారంతో పేదల వద్దకే క్యాన్సర్ వైద్యసేవలను తీసుకురావడం జరుగుతుందని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అన్నారు.

పేదల వద్దకే క్యాన్సర్ వైద్య సేవలు : ఎంపీ మాధవనేని రఘునందన్ రావు
X

దిశ, దుబ్బాక : శిశిర హాస్పిటల్ వారి సహకారంతో పేదల వద్దకే క్యాన్సర్ వైద్యసేవలను తీసుకురావడం జరుగుతుందని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అన్నారు. ఆదివారం దుబ్బాక 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిలో బీడీఎల్ సౌజన్యంతో రూ.1 కోటి రూపాయలతో శిశిర హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ బస్సును దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీతతో కలిసి ఆయన ప్రారంభించారు. ఆదివారం దుబ్బాక వంద పడకల ఆస్పత్రిలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా శిశిర హాస్పిటల్ వారి సహకారంతో మొదటగా దుబ్బాక వంద పడకల ఆసుపత్రిలో ఉచితంగా క్యాన్సర్, స్వరైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించడం జరిగిందన్నారు.

ప్రస్తుత సమాజంలో క్యాన్సర్ మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తుందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు క్యాన్సర్ పై అవగాహన లేక చివరి దశలో క్యాన్సర్ను గుర్తించడం వల్ల వారి ప్రాణాలను కాపాడలేక పోతున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే, చికిత్స తేలికవుతుందని, క్యాన్సర్ పై మహిళలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల బస్సును ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మహిళల్లో ఎక్కువగా రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు వస్తున్నాయని, వాటిని చివరి దశలో గుర్తించడంతో వారి ప్రాణాలను కాపాడలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్రంలో ప్రధానిగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా మెదక్ పార్లమెంటు పరిధిలోని మహిళల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలతో పాటు ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స అందిస్తారన్నారు. మెదక్ పార్లమెంటు పరిధిలోని ప్రతి మండల కేంద్రంలో ప్రతివారం మహిళలందరికీ ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. క్యాన్సర్ నుంచి పేద ప్రజలకు విముక్తి కలగాలని అతి త్వరలోనే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల కోసం మరో బస్సును కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శిశిర ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సింధు మాధవనేని, శ్రవణ్ తేజ, ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్, దుబ్బాక ఎంపీడీవో భాస్కర శర్మ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్, జిల్లా దిశ కమిటీ సభ్యులు సుంకోజి ప్రవీణ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంబటి బాలేష్ గౌడ్, బీజేపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Next Story