కిషన్ రెడ్డి.. బరాబర్ నీ సంగతేంటో తేలుస్తా: మరోసారి సీఎం రేవంత్ వార్నింగ్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-07 14:07:35  IST  )

రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి అనుమతులు తీసుకురాకుంటే కిషన్ రెడ్డి సంగతేంటో తేలుస్తామన్నారు సీఎం.

కిషన్ రెడ్డి.. బరాబర్ నీ సంగతేంటో తేలుస్తా: మరోసారి సీఎం రేవంత్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీని పరిపాలనా సౌలభ్యం కోసమే మూడు కార్పొరేషన్లుగా విభజించామని, ఎన్నికల్లో లబ్ధికోసమే విభజించినట్లు వస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉప్పల్ భగాయత్ లో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం సీఎం ప్రసంగించారు. నగరంలో ప్రజలు ఏ పని కావాలన్నా ట్యాంక్ బండ్ వద్దకే వెళ్లాల్సి వస్తోందని, అంతదూరం వెళ్లి ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకే కార్పొరేషన్లను విభజించామన్నారు. మల్కాజిగిరి అభివృద్ధి కోసం ఎన్ని నిధులు కావాలన్నా ప్రభుత్వం నుంచి ఇచ్చే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. ఎంపీగా చేయలేని పనులన్నీ ఇప్పుడు సీఎంగా ఉండి చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. తాను ఎన్నికలున్నపుడు మాత్రమే రాజకీయాలు చేస్తానని.. ఆ తర్వాత అభివృద్ధే అజెండాగా ముందుకు వెళ్తామన్నారు. మూసీ మురికి వల్లే ఉప్పల్ విలువ తగ్గిపోయిందని, దానివల్లే నల్గొండ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాంటి మూసీని ప్రక్షాళన చేస్తామంటే.. అనేకమంది అడ్డుపడుతున్నారని దుయ్యబట్టారు.

గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్, ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేశారని, యూపీలో గంగానదిని ప్రక్షాళన చేసినట్లు యోగి చెప్పుకున్నారని గుర్తుచేసిన సీఎం.. మూసీ ప్రక్షాళనకు మాత్రం అడ్డంకులు సృష్టిస్తున్నారని ఫైరయ్యారు. మా మోదీ నదులను ప్రక్షాళన చేశారని గొప్పగా చెప్పుకుంటున్న బీజేపీ నేతలు.. మూసీ ప్రక్షాళనపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారన్నారు. అలాగే ఆర్ఆర్ఆర్ ఎందుకు ఆగుతుంది? ఎవరు ఆపుతున్నారని ప్రశ్నించారు. నగరంలో 122 కిలోమీటర్ల మేర మెట్రోను పొడిగించాలని తాను కాళ్లకు బలపం కట్టుకుని ఢిల్లీకి తిరుగుతుంటే.. రాష్ట్రంలో ఉన్న కేంద్రమంత్రి మాత్రం కాలికి కట్టెకట్టుకుని మెట్రో ప్రతిపాదనలను అడ్డుకున్నారని విమర్శించారు. మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణాలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి లేదా అని నిలదీశారు. మెట్రో విస్తరణ లేకపోవడం వల్ల హైదరాబాద్ మెట్రో స్థానం 9కి పడిపోయిందన్నారు.

నగరంలో 1.34 కోట్లమందికి సదుపాయాలు కల్పించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదన్నారు. హయత్ నగర్ వరకూ నగర జనాభా విస్తరించి ఉందన్న విషయం అందరికీ తెలుసని, అక్కడి వరకూ మెట్రోను విస్తరించాలన్న డిమాండ్ ఉందన్నారు. జూన్ 15వ తేదీ తర్వాత.. మెట్రో విస్తరణకి అనుమతులు, ఆర్ఆర్ఆర్ కు పర్మిషన్, రాష్ట్రంలో వడ్లు కొనడం, మూసీ ప్రక్షాళనకు అనుమతులు రాకుంటే.. బరాబర్ కిషన్ రెడ్డి సంగతేంటో చూస్తామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హెచ్చరించారు. ఆ పార్టీలోనే ఉండి.. పక్క పార్టీవాళ్లకి సపోర్ట్ చేస్తారని సొంతపార్టీ వాళ్లే కిషన్ రెడ్డి గురించి చెప్తున్నారని సీఎం విమర్శించారు. బీజేపీలో ఉంటూ.. కేటీఆర్ తో మాట్లాడుతారని చెప్తున్నారన్నారు. ఎన్నికలున్నప్పుడు రాజకీయాలు చేద్దామని, మిగతా సమయంలో ప్రజా సమస్యలపై దృష్టిపెట్టి పరిష్కరించి, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందామని కోరారు.

నన్ను ఆపేవాళ్లు ఈ గడ్డమీద పుట్టలేదు" : సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి కౌంటర్

Next Story