- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నిరుద్యోగుల జీవితాలతో ఆటలొద్దు’.. కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కొండా సురేఖ నిప్పులు!
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టును నిరసిస్తూ గురువారం యాదగిరిగుట్టలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యతో కలిసి మాట్లాడారు. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా క్వశ్చన్ పేపర్ల లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, నిరుద్యోగులు తమ భవిష్యత్తు కోసం చేపట్టిన ధర్నా పై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని మంత్రి మండిపడ్డారు. లాఠీఛార్జ్ చేసి తలలు పగిలేలా, కాళ్లు చేతులు విరిగేలా కొట్టడం దారుణమన్నారు.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి అగ్ర నాయకులను కూడా రోడ్లపై ఈడ్చుకెళ్తూ 'మ్యాన్‌హాండ్లింగ్' చేశారని, మహిళా కానిస్టేబుళ్లతో ప్రియాంక గాంధీని నెట్టి వేయించడం బీజేపీ అరాచక పాలనకు పరాకాష్ట అని విమర్శించారు. గత 12 ఏళ్లలో ఎన్టీఏ ఆధ్వర్యంలో దాదాపు 150కి పైగా ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని మంత్రి ఆరోపించారు. సరైన న్యాయం జరగక ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రధాని నరేంద్ర మోదీకి కనపడకపోవడం శోచనీయమన్నారు. నేడు కోట్లాది మంది విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్న మోదీ ప్రభుత్వం స్పందించకపోవడం, బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమన్నారు. ప్రధాని మోదీ వెంటనే స్పందించి రద్దు చేయాలని, పారదర్శకంగా కొత్త సంస్థ ద్వారా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల డిమాండ్లు నెరవేరే వరకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.






