క్షమాపణలు చెప్పకుంటే లీగల్ నోటీసులు పంపిస్తా.. రేవంత్ రెడ్డికి ఆరోపణలకు కేటీఆర్ కౌంటర్

by Prasad Jukanti |   (  Updated:2026-07-23 06:19:19  IST  )

గ్లోబరీనాతో బీఆర్ఎస్‌కు గానీ తనకు గానీ సంబంధం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించబోతున్నట్లు చెప్పారు.

క్షమాపణలు చెప్పకుంటే లీగల్ నోటీసులు పంపిస్తా.. రేవంత్ రెడ్డికి ఆరోపణలకు కేటీఆర్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం ఒక్కసారైనా చీఫ్ మినిస్టర్‌లా ప్రవర్తించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గ్లోబరీనా (Globarena) సంస్థతో బీఆర్ఎస్‌కు గానీ తన కుటుంబానికి, తనకు గానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పేపర్ లీక్‌ల వంటి దురదృష్టకరమైన ఘటనపై రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. నిన్న కొడంగల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 'తెలంగాణలో 2019లో జరిగిన ఇంటర్ పరీక్షల్లో కేటీఆర్ బినామీ సంస్థ గ్లోబరీనా అవకతవకలకు పాల్పడటంతో 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని.. 2023 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పప్పులుడకవని అదే సంస్థ కేటీఆర్ సహకారంతో కేంద్రంలోని పెద్దలతో సంప్రదించి పేరు మార్చుకుందని ఆరోపించారు. ఇదే గ్లోబరీనా సంస్థ సీబీఎస్ఈ జవాబు పత్రాలను దిద్దే కాంట్రాక్ట్ తీసుకుని అవకతవకలకు పాల్పడిందని క్రమంలో ధర్మేంద్ర ప్రధాన్ తో ఒప్పందం చేసుకుని మరింతగా విజృంభించింది' అని చేసిన ఆరోపణలపై తాజాగా ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ సీఎం చేసిన ఆరోపణలను ఖండించారు.

క్షమాపణలు చెప్పకుంటే లీగల్ నోటీసులు:

పేపర్ లీక్ లాంటి దురదృష్టకర ఘటనపై ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ బాధ్యతాయుతంగా రాహిత్యంతో చౌకబారు రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలను ప్రచారం చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చేసిన ఆరోపణలను సీఎం వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని, లేదంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కేటీఆర్ హెచ్చరించారు. ఈ మేరకు తన లీగల్ టీమ్ త్వరలోనే ముఖ్యమంత్రికి లీగల్ నోటీసు పంపనున్నట్లు హెచ్చరించారు. చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి అసభ్యకరమైన, అర్థంలేని ఆరోపణలకు నేను స్పందించను. అందుకని నేను అతడి ఆరోపణలతో ఏకీభవిస్తున్నానని కాదన్నారు. బురదలో కుస్తీ పట్టడం నాకు ఇష్టం లేదని అందుకే మౌనంగా ఉంటానని చెప్పారు.

Next Story