మూడు దశాబ్దాల పూర్వ విద్యార్థుల - ఆత్మీయ సమ్మేళనం

by Batti.Sumithra |

ఒకే తరగతి గదిలో ఒకే బెంచి పై కూర్చున్న పలువురు విద్యార్థులు మూడు దశాబ్దాల తర్వాత ఒకే వేదిక పై అందరూ ఒకటయ్యారు.

మూడు దశాబ్దాల పూర్వ విద్యార్థుల - ఆత్మీయ సమ్మేళనం
X

దిశ, శంకర్ పల్లి : ఒకే తరగతి గదిలో ఒకే బెంచి పై కూర్చున్న పలువురు విద్యార్థులు మూడు దశాబ్దాల తర్వాత ఒకే వేదిక పై అందరూ ఒకటయ్యారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల 1995-96 పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. వివరాల్లోకెళ్తే శంకర్ పల్లిలోని జూలకంటి కృష్ణారెడ్డి గార్డెన్లో ఆదివారం విద్యార్థులు వారికి బోధించిన ఉపాధ్యాయులను అందరూ ఒకే వేదిక పై కనిపించడంతో పండుగ వాతావరణం నెలకొంది. నాడు ఓకే తరగతి గదిలో ఒకే బెంచి పై కూర్చుని ఉపాధ్యాయుడు చెప్పే పాఠాలు విన్న విద్యార్థులంతా నేడు వివిధ రంగాల్లో వివిధ ప్రాంతాల్లో స్థిరపడి వారంతా ఒకే వేదిక పై కలుసుకున్నారు. ఒకరి బాగోగులు ఒకరు పంచుకున్నారు. విభిన్న రంగాల్లో ఉన్నత స్థానాల్లో రాణిస్తున్న తమ తోటి మిత్రులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించుకున్నారు.

దేశ సేవకులకు ఘన సన్మానం..

దేశ రక్షణలో భాగస్వాములై ఆర్మీలో విశేష సేవలు అందించిన పూర్వవిద్యార్థులను ఈ సమావేశంలో సహచర మిత్రులు ఘనంగా సన్మానించారు. ఇదే బ్యాచ్ లో చదివిన బుల్కాపూర్ గ్రామానికి చెందిన పుష్పాల్ రెడ్డి, లక్ష్మారెడ్డి కూడా గ్రామానికి చెందిన సత్యనారాయణ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నారు. దేశానికి వారు చేసిన సేవలను కొనియాడుతూ వారిని శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. అదే విధంగా విద్యా పోలీసు ప్రభుత్వ న్యాయ జర్నలిజం వ్యవసాయం రియల్ ఎస్టేట్ సినీ రంగాల్లో స్థిరపడ్డ వారి సేవలను సమావేశంలో కొనియాడారు.

సెప్టెంబర్ 5వ తేదీన పూర్వవిద్యార్థుల ఆధ్వర్యంలో గురుపూజోత్సవం..

టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎం.సలీం పాషా మాట్లాడుతూ రాబోయే గురుపూజోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీన తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించేందుకు భారీఎత్తున ఏర్పాట్లు చేయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులంతా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం పూర్వ విద్యార్థులతో పలు కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 60 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు మృతి చెందిన పలువురికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.

Next Story