ఆర్గొండలో మద్యపానం నిషేధించాలని గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం

by Batti.Sumithra |

రాజంపేట మండలంలోని ఆర్గొండ గ్రామంలో సర్పంచ్ ఎర్ర విక్రాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభలో గ్రామంలో మద్యపానాన్ని నిషేధిస్తూ ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

ఆర్గొండలో మద్యపానం నిషేధించాలని గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం
X

దిశ, రాజంపేట్ : రాజంపేట మండలంలోని ఆర్గొండ గ్రామంలో సర్పంచ్ ఎర్ర విక్రాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభలో గ్రామంలో మద్యపానాన్ని నిషేధిస్తూ ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గురువారం నిర్వహించిన గ్రామసభలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎర్ర విక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో బెల్ట్ షాపుల కారణంగా యువత పెడదోవ పడుతోందని, మద్యపానం వల్ల కుటుంబాల్లో కలహాలు పెరుగుతున్నాయని తెలిపారు.

మద్యపానాన్ని నిషేధించడం ద్వారా కుటుంబ కలహాలు, అప్పులు, నేరాలు, రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అందుకే గ్రామ ప్రజలందరి సహకారంతో మద్యపాన నిషేధం పై తీర్మానం చేసినట్లు వెల్లడించారు. ఈ తీర్మానాన్ని ఎవరైనా ఉల్లంఘించి గ్రామంలో మద్యం విక్రయిస్తే రూ.1 లక్ష జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అలాగే గ్రామంలో ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం అందించిన వారికి రూ.10 వేల నగదు బహుమతి అందజేస్తామని తీర్మానంలో పేర్కొన్నారు. గ్రామస్తులందరి ఏకాభిప్రాయంతో తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలవాలని, రాష్ట్రంలోని ఇతర గ్రామాలకు కూడా ఆర్గొండ ఆదర్శంగా మారాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.

Next Story