- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఉమ్టా’కు నిధుల కరువు.. ‘యూటీఎఫ్’ వసూలుపై సర్కారు కసరత్తు
హైదరాబాద్ రవాణా వ్యవస్థను సమన్వయం చేసే ‘ఉమ్టా’కు తీవ్ర నిధుల కొరత. ఎస్క్రో అకౌంట్ ద్వారా నిధుల వసూలుపై ఈ వారంలో సీఎస్ అధ్యక్షతన కీలక సమావేశం.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాలో ప్రజారవాణ, ట్రాఫిక్ అంశాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడంతో పాటు వాటికి పరిష్కార మార్గాలను చూపించడానికి ఏర్పాటు చేసిన ‘యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ ‘(హెచ్-యూఎంటీఏ)కు నిధుల కొరత వెంటాడుతున్నది. ఈ నేపథ్యంలో ‘అర్బన్ ట్రాన్స్ పోర్ట్ ఫండ్’ (యూటీఎఫ్)ను జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలో రూ. లక్షల కోట్ల ప్రాజెక్టు పనులు జరుగుతున్నా యూటీఎఫ్ జమ కావడం లేదు. దీంతో ఫండ్ వసూలు చేయడానికి ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించాలని సర్కారు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ వారంలో జరిగే ‘ఉమ్టా’ సమావేశంలో ఫండ్ వసూలుపై స్పష్టత వచ్చే అవకాశముంది.
‘ఉమ్టా’ రికమండేషన్స్ ప్రకారమే..
రాష్ట్రంలో ‘ఉమ్టా’ రికమండేషన్స్ ఆధారంగా ‘కాంప్రెహెన్షివ్ ట్రాన్స్ పోర్ట్ స్టడీ’ (సీటీఎస్) రిపోర్టు వచ్చింది. దీని ఆధారంగానే హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు, ఎంఎంటీఎస్ రైళ్లు, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఎస్ఆర్డీపీలో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు, రోడ్డు విస్తరణ ప్రాజెక్టులు, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఫ్లైఓవర్ల నిర్మాణాలు చేపట్టారు. వీటిలో మెట్రో రైలు మొదటి దశ సైతం పూర్తి చేశారు. 30కిపైగా ఫ్లై ఓవర్లు కంప్లీట్ అయ్యాయి. బస్ రూట్లను కూడా పెంచారు. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్-2050 లో భాగంగా ‘కాంప్రెహెన్షిల్ మొబిలిటీ ప్లాన్’ (సీఎంపీ) రిపోర్టును సైతం సిద్ధం చేశారు. దీని ద్వారా హెచ్ఎండీఏ, ఫ్యూచర్ సిటీ పరిధిలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచే అవకాశముంది. వీటన్నింటినీ సమన్వయం చేయడానికి ‘ఉమ్టా’ పని చేస్తుంది. కానీ చట్టం ప్రకారం రావాల్సిన ఫీజులు ‘ఉమ్టా’కు రావడం లేదు. ఇక నుంచి ‘ఉమ్టా’ను యాక్టివ్ చేయడంతోపాటు చట్టం ప్రకారం రావాల్సిన ఫీజులు వసూలు చేయడానికి హెచ్ఎండీఏ మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నది.
ప్రత్యేక ‘ఎస్క్రో’ అకౌంట్ ద్వారా..
హెచ్ఎండీఏ చట్టం ప్రకారం హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ (ఉమ్టా) కోసం ప్రత్యేకంగా అర్బన్ ట్రాన్స్ పోర్ట్ ఫండ్ (యూటీఎఫ్) ఏర్పాటు చేయాలి. ఈ ఫండ్ కు నిధుల కోసం ఉమ్టా పరిధిలోని ట్రాన్స్ పోర్ట్, ట్రాఫిక్ ప్రాజెక్టుల వ్యయంలో 0.25 శాతం, అలాగే హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, ఇతర పట్టణ స్థానిక సంస్థలు వసూలు చేసే డెవలప్మెంట్ చార్జీల్లో 0.25 శాతం చొప్పున ప్రత్యేక ఎస్క్రో అకౌంట్ లో జమ చేయాలని చట్టం చెబుతోంది. అంటే మొత్తం 0.5 శాతం నిధులు యూటీఎఫ్ కు చేరాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు సంబంధిత శాఖల నుంచి ఫండ్ వసూలు కాలేదు. దీంతో బెంగళూరు తరహాలో ఈ విధానాన్ని అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. యూటీఎఫ్ లో జమయ్యే నిధులను రవాణా రంగంలో మార్పులపై అధ్యయనాలు, శిక్షణా కార్యక్రమాలు, సమావేశాల నిర్వహణ తో పాటు ప్రజా రవాణా ప్రణాళికల సమన్వయానికి వినియోగించుకోవచ్చు.
ఈ వారంలో ‘ఉమ్టా’ సమావేశం
యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ (ఉమ్టా) చైర్మన్ గా ఉన్న చీఫ్ సెక్రెటరీ అధ్యక్షతన ఈ వారంలో సమావేశం నిర్వహించనున్నారు. ‘ఉమ్టా’ ఆధ్వర్యంలో భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టులు, ఆయా శాఖల నుంచి రావాల్సిన డెవలప్మెంట్ చార్జీలు, ప్రాజెక్టు వ్యయం నుంచి ఫీజులను ఏ విధంగా రాబట్టాలి? ఆయా శాఖలు అనుసరించాల్సిన బాధ్యతల గురించి చర్చించనున్నారు. ఉమ్టా మార్గదర్శకాలపై కూడా చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు.






