- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మృత్యు కూడలిగా ఊకల్ క్రాస్
వరంగల్–నర్సంపేట జాతీయ రహదారి పై వేలాది మంది వాహనదారులు ప్రతిరోజూ ప్రయాణాలు సాగిస్తున్నారు.

దిశ, గీసుకొండ : వరంగల్–నర్సంపేట జాతీయ రహదారి పై వేలాది మంది వాహనదారులు ప్రతిరోజూ ప్రయాణాలు సాగిస్తున్నారు. అయితే, ఈ హైవే పై ఉన్న ఊకల్ క్రాస్ ప్రాంతం ప్రస్తుతం ప్రమాదాలకు నిలయంగా మారింది. లారీల అడ్డా, అక్రమ పార్కింగ్ కారణంగా ఈ ప్రాంతం పూర్తిగా అస్తవ్యస్తంగా మారి, వాహనదారులకు నిత్యం ప్రాణాపాయంగా మారుతోంది.
అక్రమ లారీల అడ్డా..
వ్యవసాయ భూమిని లారీల పార్కింగ్ స్థలంగా వినియోగిస్తున్నారు. అక్కడి నుంచి రోడ్డుపైకి వచ్చే ప్రతి లారీ తన వెంట కుప్పల కొద్దీ నల్లమట్టి, బురదను రోడ్డుపైకి తీసుకొస్తోంది. దీంతో దాదాపు కిలోమీటర్ మేర జాతీయ రహదారి మొత్తం మట్టిరోడ్డును తలపించేలా మారింది.
రోడ్డు ఆక్రమణ – ట్రాఫిక్ స్తంభన..
రోడ్డుకు ఇరువైపులా వందల సంఖ్యలో లారీలను వారాల తరబడి నిలిపివేస్తున్నారు. దీంతో రహదారి సగానికి పైగా ఆక్రమణకు గురై, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఆర్టీసీ బస్సులు, అంబులెన్సులు, పాఠశాల వాహనాలు కూడా గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నాయి. వర్షం కురిసిన వెంటనే రోడ్డుపై పేరుకుపోయిన మట్టి జారుడు బురదగా మారుతోంది. ఇప్పటికే పలువురు ద్విచక్ర వాహనదారులు స్కిడ్ అయి కిందపడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ మార్గంలో ప్రయాణం అంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లినట్లేనని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పెద్ద ప్రమాదం జరిగిన తర్వాతే అధికారులు స్పందిస్తారా ? అంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల ఆగ్రహం..
ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు ఈ రహదారిపైనే ప్రయాణిస్తుంటారు. రాత్రి వేళల్లో తగినంత వీధి దీపాల వెలుతురు లేకపోవడం, రోడ్డుపై మట్టి పేరుకుపోవడం వల్ల ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా, లారీల రాకపోకలతో ఎగిసిపడుతున్న ధూళి కారణంగా సమీప గ్రామాల ప్రజలు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు, వాహనదారులు వెంటనే అక్రమ లారీల అడ్డాను తొలగించి, రహదారిని శుభ్రపరచడంతో పాటు ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరుతున్నారు.






