నియోజకవర్గంలోని ప్రతి పేదవాడికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించడమే ఐక్యత ఫౌండేషన్ లక్ష్యం

by Taduka Kalyani |

తలకొండపల్లి మండల కేంద్రంలో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ప్రముఖ కంటి వైద్య సంస్థ శంకర నేత్రాలయ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న మెగా ఉచిత కంటి వైద్య శిబిరం రెండో రోజూ ఆదివారం విజయవంతంగా కొనసాగింది.

నియోజకవర్గంలోని ప్రతి పేదవాడికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించడమే ఐక్యత ఫౌండేషన్ లక్ష్యం
X

దిశ, తలకొండపల్లి : తలకొండపల్లి మండల కేంద్రంలో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ప్రముఖ కంటి వైద్య సంస్థ శంకర నేత్రాలయ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న మెగా ఉచిత కంటి వైద్య శిబిరం రెండో రోజూ ఆదివారం విజయవంతంగా కొనసాగింది. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన కంటి వైద్యాన్ని పూర్తిగా ఉచితంగా అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సి.ఓ.ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. శిబిరం రెండో రోజు దాదాపు 600 మందికి పైగా ప్రజలు శిబిరాన్ని సందర్శించగా, 280 మందికి పైగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు.180 మందికి పైగా ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేయగా, 25 మందిని కంటి శుక్లాల శస్త్ర చికిత్స కోసం ఎంపిక చేశారు. ఈ సందర్భంగా శిబిరాన్ని సందర్శించిన సుంకిరెడ్డి వైద్య బృందంతో మాట్లాడి, శిబిరం నిర్వహణ, ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంత ప్రజలకు ఖరీదైన కంటి వైద్యాన్ని ఉచితంగా అందించాలనే సంకల్పంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. శిబిరానికి వచ్చే ప్రతి ఒక్కరికీ కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ, అవసరమైన వారికి ఉచిత కంటి అద్దాలు, కంటి శుక్లాల శస్త్రచికిత్స వంటి సేవలను అందిస్తున్నామని చెప్పారు.

నిరుపేదలకు ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సేవలకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఐక్యత ఆరోగ్య భరోసా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. తలకొండపల్లితో పాటు పరిసర గ్రామాల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ నెల 12వ తేదీ వరకు శిబిరం సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రెండు రోజుల వ్యవధిలో మొత్తం 1,200 మందికిపైగా ప్రజలు శిబిరాన్ని సందర్శించగా, 600 మందికిపైగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. 350 మందికి ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేయగా, 46 మందిని కంటి శుక్లాల శస్త్రచికిత్సకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ వైద్య నిపుణుల సేవలతో కొనసాగుతున్న ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఉచిత వైద్య సేవలను పొందాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు శంకర్ నాయక్, కళ్యాణ్ నాయక్, ఉపసర్పంచ్‌లు భాస్కర్, డేరంగుల అనిత విజయ్, రమేష్ యాదవ్, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వైద్య బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Next Story