‘BRS కు దూరమయ్యానని నన్ను మర్చిపోతున్నారు’.. మాజీ మంత్రి మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్

by Prasad Jukanti |   (  Updated:2026-07-05 12:07:54  IST  )

గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి మల్లారెడ్డి ఫ్యామిలీ బీజేపీ గూటికి చేరబోతోందా? తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.

‘BRS కు దూరమయ్యానని నన్ను మర్చిపోతున్నారు’.. మాజీ మంత్రి మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తనదైన డైలాగులతో నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేసే మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా ఓ కార్యకర్త బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న మల్లారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'BRSకు దూరమయ్యానని నన్ను మర్చిపోతున్నారు' అంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్‍కు గుడ్ బై చెప్పి త్వరలోనే ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారనే ప్రచారం జరుగుతున్న వేళ మల్లారెడ్డి ఈ రకమైన కామెంట్స్ చేయడం ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్‍గా మారాయి. మల్లారెడ్డి వ్యాఖ్యల వెనుక మర్మం ఏంటి అనేది కార్యకర్తలు, నేతల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

బీఆర్ఎస్‍తో అంటిముట్టనట్లు:

అధికారంలో ఉండగా బీఆర్ఎస్ పెద్దల తలలో నాలుకలా ఉన్న మల్లారెడ్డి అధికారం దూరమయ్యాక తన దారి తాను వెతుక్కునే పనిలో పడ్డారనే ప్రచారం చాలా కాలంగా వినిపిస్తోంది. ఈ కాంగ్రెస్‍, బీజేపీ, టీడీపీలో చేరేందుకు ఆయన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారనే ప్రచారం జరింగింది. క్రమంలో కొన్ని రోజులుగా తెలంగాణ భవన్ వైపు రావడం మానేసిన మల్లారెడ్డి.. బీఆర్ఎస్ కార్యక్రమాల్లోనూ మునుపటిలా యాక్టివ్‍గా పాల్గొనడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కేటీఆర్, హరీశ్ రావు లాంటి ముఖ్యనేతలు ప్రెస్ మీట్ల సమయంలోనూ మల్లారెడ్డి తెలంగాణ భవన్ వైపు తొక్కి చూడటం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్‍తో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలో తాను బీఆర్ఎస్‍కు దూరమయ్యానని మీరు నన్ను దూరం పెడుతున్నారు అంటూ కార్యకర్తలతో మల్లారెడ్డి మాట్లాడటం కొత్త చర్చకు దారి తీసింది. ఈ వ్యాఖ్యల వెనుక మల్లారెడ్డి పార్టీ మారడం ఖాయం అనే ప్రచారానికి బలం చేకూరుతోందనే టాక్ వినిపిస్తోంది.

బీజేపీ నేతలతో మల్లారెడ్డి కోడలు భేటీ:

ఈ క్రమంలో మల్లారెడ్డి కోడలు డా.ప్రీతిరెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అలాగే ఆమె బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లడం అక్కడ కీలక నేతలతో భేటీ కావడంతో మల్లారెడ్డి ఫ్యామిలీ బీఆర్ఎస్‍కు గుడ్ చెప్పబోతోందనే ప్రచారం మరింత ఊపందుకుంది. ప్రస్తుతం మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో తమ కుటుంబానికి మొత్తం నాలుగు టికెట్లు ఇవ్వాలనే షరతు మీద మల్లారెడ్డి ఫ్యామిలీ ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీతో హామీ తీసుకునే పనిలో ఉందనే ఊహాగానాలు పొలిటికల్ కారిడార్‍లో గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి చేసిన తాజా వ్యాఖ్యల వెనుక పరమార్ధం ఏంటి? మల్లారెడ్డి యాదృచ్చికంగా ఆ మాటలు అన్నారా? లేక నిజంగానే బీఆర్ఎస్‍కు దూరమయ్యే వ్యూహంతో ఉన్నారా అనేది ఉత్కంఠగా మారింది.

Next Story